రాజ్యసభ కోసం వ్యూహ ప్రతివ్యూహాలు

  • షెడ్యూల్‌ విడుదల చేసిన ఇసి
  • వైసిపి రెబల్స్‌పై స్పీకర్‌ విచారణ
  • హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజ్యసభ ఎన్నికల్లో సత్తా చాటడాన్ని వైసిపి, టిడిపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అన్ని సీట్లను దక్కించుకోవడానికి వైసిపి, తగినంత సంఖ్యాబలం లేకపోయినా ఒక సీటు కైవసం చేసుకోవడానికి టిడిపి వ్యూహప్రతివ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. వైసిపి రెబల్‌ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల అనర్హత పిటిషన్లపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ ప్రక్రియను నిర్వహించారు. ఈ విచారణ ప్రక్రియ జరుగుతుండగానే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. మరోవైపు వైసిపి రెబల్స్‌ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. వైసిపి ఎంఎల్‌ఎలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవలి శ్రీదేవి విచారణకు హాజరయ్యారు. విడివిడిగా జరిగిన విచారణలో తమకు మరింత సమయం కావాలని వారు కోరారు. న్యాయనిపుణులతో సంప్రదించేందుకు, వీడియో పేపర్‌ క్లిప్పింగ్‌ల వాస్తవాల నిర్ధారణకు తమకు సమయం అవసరమని వారు స్పీకర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. సహజ న్యాయసూత్రాల ప్రకారం తమ వాదనలూ వినాలని, ఆ వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని వారు కోరినట్లు తెలిసింది. తాము చేసిన ఈ విజ్ఞప్తిని స్పీకర్‌ తిరస్కరించినట్లు విచారణ అనంతరం వారు మీడియాకు తెలిపారు.

ఏం చెప్పారు…?

స్పీకర్‌ను కలిసిన అనంతరం వైసిపి రెబల్స్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాము స్పీకర్‌ దృష్టికి తీసుకుపోయిన అంశాలను వివరించారు. అనర్హత పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు మరింత సమయం అవసరమని రాతపూర్వకంగా స్పీకర్‌ను గతంలోనే కోరామని, దానికి ఆయన స్పందించకపోవడంతో ఇప్పుడు ప్రత్యక్షంగా కలిసినట్లు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఆ మేరకు వైద్యులిచ్చిన నివేదికను సమర్పించినా స్పీకర్‌ పట్టించుకోవడం లేదని అన్నారు. తాను విప్‌ ఉల్లంఘించాననడానికి ఆధారలేమిటో బయటపెట్టాలని కోరినట్లు తెలిపారు. ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ నోటీసు ఇచ్చిన రెండు వారాల్లోనే సమాధానం ఇవ్వాలని స్పీకర్‌ పట్టుబడుతున్నారని అన్నారు. అదే సమయంలో గంటా శ్రీనివాసరావు ఇచ్చిన రాజీనామాపై మూడున్నరేళ్లు ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. తాను క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు చేస్తున్నారని, దానికి సంబంధించి ఆధారాలు బయట పెట్టాలని కోరారు. టిడిపి నుండి వైసిపిలో చేరిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ విచారణకు హాజరయ్యారు. టిడిపి విధానాలు నచ్చక తాను వైసిపిలో చేరినట్లు పేర్కొన్నారు. మరో ఎమ్మెల్యే మద్దాలి గిరి విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలిసింది. వల్లభనేని వంశీమోహన్‌, కరణం బలరాం విచారణకు రాలేదు. అలాగే వైసిపి నుండి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ కూడా విచారణకు హాజరయ్యారు.

ఈ దశలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

స్పీకర్‌ ఛాంబర్‌లో విచారణ ప్రక్రియ జరుగుతుండగానే స్పీకర్‌ జారీ చేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ వైసిపి రెబల్‌ ఎంఎల్‌ఎలు హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మండలి ఛైర్మన్‌ జారీ చేసిన నోటీసులను ఎంఎల్‌సి సి. రామచంద్రయ్య సవాల్‌ చేశారు. వీటిని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఎంఎల్‌ఎల తరపు వాదనలు విన్న అనంతరం ఈ దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు కావాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. అసెంబ్లీ స్పీకర్‌ విచారణ చర్యలను నిలివేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

 

8న నోటిఫికేషన్‌, 27న పోలింగు

రాజ్యసభలో ఖాళీ అవుతున్న 56 స్థానాల భర్తీకి ఎన్నికల కమిషన్‌ సోమవారం షెడ్యూలు విడుదల చేసింది. రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి ఎనిమిదిన నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకూ నామినేషన్ల దాఖలు చేయొచ్చు. 16వ తేదీన పరిశీలన జరుగుతుంది. 20వ తేదీన ఉపసంహరణకు చివరితేదీగా ప్రకటించారు. 27న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగు జరుగుతుంది. సాయంత్రం ఐదుగంటల నుండి లెక్కింపు మొదలవుతుంది. అదేరోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 మంది రాజ్యసశ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. వీటిలో రాష్ట్రంలో మూడు స్థానాలున్నాయి. సి.ఎం.రమేష్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిల స్థానాలను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో పోటీ తప్పదా? రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ వైసిపి ముగ్గురు అభ్యర్థులను నిలబెడుతుండగా, టిడిపి కూడా ఒక అభ్యర్థిని పోటీలో పెట్టనుంది. వైసిపి తరుపున వై.వి.సుబ్బారెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఎ.శ్రీనివాసులు, పాయకరావుపేట ఎమ్మెల్యే జి.బాబూరావు పోటీ చేయనున్నట్లు తెలిసింది. టిడిపి తరుపున అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు.

➡️