పోరాడి పరిష్కరించుకుంటున్నాం : ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యుల ఉద్యమానుభవాలు

ప్రజాశక్తి- కర్నూలు, అనంతపురం ప్రతినిధులుపోరాటాలతో ముందుకు సాగుతున్నామని పలు రాష్ట్రాలకు చెందిన ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు తెలిపారు. రైతుల సమస్యలపై పోరాడి సమస్యలను పరిష్కరించుకుంటున్నామని చెప్పారు. ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా పలు రాష్ట్రాల ఎఐకెఎస్‌ కౌన్సిల్‌ సభ్యులు తమ ఉద్యమానుభవాలను ‘ప్రజాశక్తి’తో పంచుకున్నారు.

మూడు చారిత్రాత్మక పోరాటాలు

మహారాష్ట్రలో మూడు చారిత్రాత్మక పోరాటాలు 2016 నుంచి సాగాయి. వీటి ద్వారా రైతులు ఫలితాలు సాధించ గలిగారు. ఇది వారిలో స్ఫూర్తినివ్వడమే కాకుండా సమస్యలపై సమిష్టిగా కదలాలన్న విశ్వాసాన్ని కల్పించింది. మహా రాష్ట్రలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న సమయంలో రైతుల రుణాలు మాఫీ చేయాలని, కనీస మద్దతు ధర కల్పించాలని, గిరిజనులకు హక్కు పట్టాలివ్వాలన్న ప్రధాన డిమాండ్లపై 2018లో నాసిక్‌ నుంచి ముంబయికి లాంగ్‌మార్చు నిర్వహించాం. ఇందులో పెద్ద ఎత్తున రైతులు భాగస్వాములై ప్రభుత్వం ముందు తమ డిమాండ్లను ఉంచారు. ఈ పోరాటానికి దేశ ప్రజల మద్దతు కూడా పెద్ద ఎత్తున లభించింది. దీంతో, ప్రభుత్వం ముందుకొచ్చి చర్చలు జరిపింది. ఇదే డిమాండ్లపై మరోమారు లాంగ్‌మార్చు చేపట్టగా ప్రభుత్వం దిగొచ్చి రూ.24 వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది. గిరిజనులు హక్కు పట్టాలను ఈ పోరాటం ద్వారా పొందగలిగారు. తాజాగా పాల ధరలపైనా రైతు ఉద్యమం రాష్ట్రంలో నడుస్తోంది. పాడి రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అంతర్జాతీయం ధర పెరిగినప్పుడు కంపెనీలు ఆ ధరలు చెల్లించడం లేదు. పడిపోయినప్పుడు మాత్రం ధరను అమాంతం తగ్గించేస్తున్నాయి. దీంతో, రైతులు నష్టపోతున్నారు. దీనిపై రైతులు ఇప్పుడు ఆందోళన చేపట్టారు. ధర తగ్గినప్పుడు ప్రభుత్వం రైతులకు ఇన్‌సెంటివ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనికోసం అకోల్‌ నుంచి లోని వరకు 70 కిలోమీటర్ల పాదయాత్ర ఇటీవల నిర్వహించారు. 70 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో పాడి రైతులు పాల్గొన్నారు. దీనికి ప్రభుత్వం కొంత వరకు దిగొచ్చింది. ధర స్థిరీకరణపై పోరాడుతున్న రైతులతో చర్చలు జరుపుతోంది. డిమాండ్లను అంగీకరించే దిశగా సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడు ప్రధాన పోరాటాల ద్వారా అక్కడి రైతులు విజయాలను అందుకున్నట్టు అవుతుంది. ఈ మూడు ఉదాహరణలు రైతులు సమిష్టిగా పోరాడితే సమస్యలకు పరిష్కరించుకునేందుకు వీలుంటుందని చాటి చెబుతున్నాయి.

                                   – డాక్టర్‌ అజిత్‌ నౌలే, మహారాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి

రైతులకు అండగా ఎల్‌డిఎఫ్‌

ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల కంటే భిన్నంగా రైతులకు అండగా నిలుస్తున్నది కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం. రైతు ప్రభుత్వమని మాటల్లో కాకుండా చేతల్లో చూపుతోంది. ఇది చేస్తూనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రైతులకు మరింత మేలు చేయాలని అక్కడి రైతు సంఘంగా మేము కోరుతున్నాం. వరి ధాన్యానికి కిలోకు రూ.21.20 మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేరళలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం కిలోకు రూ.28.20 చెల్లించి సేకరిస్తోంది. కిలో వరి ధాన్యంపై ఏడు రూపాయలకుపైగా అదనంగా ఇస్తోంది. అయితే, ఇది చాలదు. రూ.30లు కనీస మద్దతు ధర వరికి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘంగా మేము డిమాండ్‌ చేస్తున్నాం. పాడి రైతులకు కూడా కేరళ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని పాడి రైతులకు ఏడాదికి రూ.34 వేల అదనంగా చెల్లిస్తోంది. దీన్ని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాలని కోరుతున్నాం. పాడి రైతును కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం కిందకు తీసుకొచ్చి వేతనం చెల్లించాలని కోరుతున్నాం. పాడి ఉంటే దాన్ని చూసుకోవడానికి ఒక మనిషి అవసరమవుతాడు కాబట్టి ఆ రైతుకు పనిదినం కింద కూలి చెల్లించాలని సూచిస్తున్నాం. కేరళలో అత్యధికంగా పండే పంట రబ్బరు. మన దేశ ఉత్పత్తిలో ఇక్కడే 85 శాతం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌తో ధర ముడిపడి ఉంది. ధరలో నిలకడలేదు. ధర పడిపోయినప్పుడు కొంతవరకు ఆదుకునే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం వరి, కొబ్బరికి కొంతవరకైనా ఇన్సెంటివ్‌ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం.

                                                                                      – వల్సిన్‌ పలోనీ, కేరళ కర్షక సంఘం కార్యదర్శి

పంటల బీమాపై పెద్ద పోరాటం నడుస్తోంది

పంటల బీమాపై పెద్ద ఎత్తున పోరాటాలు నడుస్తు న్నాయి. బీమా కంపెనీలు రైతులతో ప్రీమియం కట్టించు కుంటున్నాయి. కానీ, పరిహారం ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతేడాది ఇదే రకంగా ప్రయత్నిస్తే పోరాడాము. మళ్లీ నాలుగు మాసాలుగా సుదీర్ఘ పోరాటం నడుస్తోంది. వేలాది మంది రైతులు ఈ పోరాటంలో భాగస్వాములై ఉన్నారు. దీంతో, కంపెనీలు, అధికార యంత్రాంగం దిగిరాక తప్పలేదు. బకాయిపడిన బీమాను చెల్లిస్తామని హామీ ఇచ్చాయి. అది సాధించుకునే వరకు ఈ పోరాటం ఆగదు. విద్యుత్‌, నీటి పారుదల సమస్యలపైనా రైతు సంఘం ఆధ్వర్యాన సుదీర్ఘ పోరాటాలు రాష్ట్రంలో నడుస్తున్నాయి. దీనికి రైతుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. తద్వారా ప్రజా పునాదిని పెంచుకో గలిగాం. అసెంబ్లీ ఎన్నికల్లో 16 చోట్ల రైతు సంఘం నాయకులు పోటీ చేశారు. అంతకు మునుపు రెండు చోట్ల రైతు సంఘం నాయకులు ఎమ్మెల్యేగానూ గెలుపొందారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మంచి ఓట్లే వచ్చినప్పటికీ విజయం సాధించలేకపోయాం. రెండు చోట్ల స్వల్ప ఓట్లతో రైతు సంఘం నాయకులు ఓటమి చెందారు. పోరాటాల్లో రైతులు భాగస్వామ్యులవు తుండడమే కాకుండా మద్దతూ ఇస్తున్నారు. అంతకుమునుపు చేసిన పోరాటాల ఫలితంగానే విద్యుత్‌ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వాలు వెనుకడుగు వేశాయి.

                                                                                – చగన్‌లాల్‌ చౌదరి, రాజస్థాన్‌ రైతు సంఘం కార్యదర్శి

➡️