రైతన్నకు ప్రభుత్వం భారీ బకాయిలు

Dec 22,2023 10:00 #details, #farmers debts
  • పేరుకున్న పథకాలు
  • మూడు సీజన్ల సున్నా వడ్డీ పెండింగ్‌
  • గత రబీ బీమా కూడా…
  • అదనంగా ఈ ఏడాది కరువు, మిచౌంగ్‌ తుపాన్‌ పరిహారాలు
  • ఒక పట్టాన తేల్చని ప్రభుత్వం
  • అన్నదాతల ఎదురు చూపు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : కరువూ తుపాన్లతో రైతన్నలు ఆర్థికంగా చితికిపోయి సర్కారీ సాయం కోసం ఆశగా ఎదురు చూస్తుండగా, ప్రభుత్వ పరంగా వారికి అందించాల్సిన సహాయాన్ని పేరపెడుతోంది. తాజా విపత్తు నష్టపరిహారాలనట్టుంచితే, అన్నదాతల సంక్షేమం కోసం అమలు చేస్తామన్న పథకాలకు సకాలంలో నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తోంది. రైతులకు ప్రభుత్వం బకాయి పెట్టిన స్కీంలలో గడచిన మూడు సీజన్ల సున్నావడ్డీ, గత రబీ పంటల బీమా ఉన్నాయి. కొత్తగా ఈ ఏడాది ఖరీఫ్‌లో కరువు, మిచౌంగ్‌ తుపాను ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా, రబీ పంటల బీమా అదనంగా చేరాయి. సున్నావడ్డీ ఇచ్చేదే నామమాత్రం. ఆ క్లెయిములను సైతం సీజన్లకు సీజన్ల వంతున చెల్లించకుండా ప్రభుత్వం పెండింగ్‌లో పెడుతోంది. పంటల బీమా పరిస్థితీ అంతే.

ఏకంగా మూడు కాలాలు

రైతులు బ్యాంకుల్లో తీసుకునే లక్ష రూపాయల్లోపు స్వల్పకాలిక పంట రుణాలను వడ్డీ లేకుండా (సున్నా వడ్డీ) ఇప్పిస్తామని వైసిపి సర్కారు నవరత్నాల్లో హామీ ఇచ్చింది. తీసుకున్న రుణాలు గడువు లోపు తిరిగి చెల్లిస్తే చాలు, వడ్డీ సంగతి ప్రభుత్వమే చూసుకుందన్నారు. అనంతరం మాట మార్చి ముందుగా వడ్డీతో సహా నిర్ణీత కాల వ్యవధిలో రుణాలు చెల్లిస్తే, బ్యాంకులు క్లెయిములు పెట్టాక, అప్పుడు వడ్డీ రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో రీయింబర్స్‌ చేస్తామన్నారు. ఇ-క్రాప్‌, గడువు ఇత్యాది పలు ఆంక్షలు పెట్టడంతో రైతులు సున్నావడ్డీ పొందలేకపోతున్నారు. నామమాత్రంగానే సున్నావడ్డీ వస్తోంది. ఆ నిధులు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. మామూలుగా అయితే ప్రతి ఏడాదీ అక్టోబర్‌, నవంబర్‌లో సున్నావడ్డీ రీయింబర్స్‌ చేస్తోంది. పాత ప్రభుత్వ బకాయిలతో పాటు 2021 ఖరీఫ్‌ వరకు విడుదల చేసింది. 2021-22 రబీ, 2022 ఖరీఫ్‌, 2022-23 రబీ సీజన్లకు సున్నావడ్డీ ఇవ్వాలి. డిసెంబర్‌ వచ్చినా మూడు సీజన్ల సున్నావడ్డీ ఇవ్వకపోవడంతో రైతులు ఎదురు చూస్తున్నారు.

రబీ ఇన్సూరెన్స్‌ ఎప్పుడు ?

2022-23 రబీలో భారీ వర్షాల వలన పలు జిల్లాల్లో పంటలు నష్టపోయాయి. మళ్లీ రబీ వచ్చినా గడచిన రబీ బీమా పరిహారం సెటిల్‌ కాలేదు. 2022 ఖరీఫ్‌ నుంచి కేంద్రం ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫసల్‌ బీమాలో చేరి కంపెనీలకు అమలు బాధ్యత అప్పగించింది. వాతావరణ బీమాను తానే నిర్వహించింది. ప్రభుత్వం నిర్వహించిన వాతావరణ బీమా పరిహారం కానీ, కంపెనీలు నిర్వహించిన దిగుబడి ఆధారిత బీమా (ఫసల్‌) పరిహారం కానీ రైతులకు ఇంకా అందలేదు. ఫసల్‌లో కంపెనీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1,088 కోట్లు రైతుల తరఫున ప్రీమియం చెల్లించాయి. పరిహారం జాడ లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వాల్సిన వాతావరణ బీమా సైతం ఇవ్వలేదు. గత రబీలో విపత్తులేమీ లేవా అంటే అదేమీ కాదు. భారీ వర్షాల వలన పంట నష్టపోయిన రైతుల్లో కొంత మందికైనా సర్కారు తృణమో పణమో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చింది. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చారంటే తిపత్తులున్నట్లే. అలాంటప్పుడు బీమా ఎందుకు రాలేదో అర్థం కాకుండా ఉంది. ఇదిలా ఉండగా, ఈ సంవత్సరం ఖరీఫ్‌లో వచ్చిన మిచౌంగ్‌ తుపాన్‌, కరువు ఇన్‌పుట్‌ సబ్సిడీ జనవరిలో సంక్రాంతికి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

➡️