అప్పుడు పాచిన లడ్డూ.. ఇప్పుడు అభివృద్ధి కోసం…

మోడీపై మాట మార్చిన పవన్‌ కల్యాణ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తెలుగు రాష్ట్రాన్ని బిజెపి ప్రభుత్వం ముక్కలు చేసిందనే వేదన తెలుగు ప్రజల్లో ఉందని, ఆయన ప్రధాని అయినందువల్ల బాధ కలుగుతోందని, ఆయన వల్ల రాష్ట్రానికి ఒరిగేందేమీ లేదని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు మాట మార్చారు. ఆయన రాక తెలుగు ప్రజలకు గంగమ్మతల్లి వచ్చి జీవాన్నిచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు. 2014 తరువాత ప్రత్యేక హోదా ఇవ్వలేదని, తాను బిజెపికి దూరమవుతున్నానని చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్రానికి బిజెపి ఏమిచ్చిందో చెప్పకుండానే మరలా బిజెపితో కలిసినట్లు ప్రకటించారు. పొగడ్తల వర్షం కురిపించారు. పోలవరం, ప్రత్యేక హోదా వంటి అంశాలను పవన్‌ ప్రస్తావించలేదు.

అప్పుడేమన్నారు… నేరుగా పవన్‌ మాటల్లో…
‘తెలుగు ప్రజలను బిజెపి రెండుగా చీల్చింది. దీనిపై గుండెల్లో వేదన ఉంది. నరేంద్ర మోడీ ప్రధాని అవగానే పవన్‌ కల్యాణ్‌ను మర్చిపోయారు. దేశానికి ప్రధాని అయితే మంచి రోజులు వస్తాయని ఆశపడ్డాం. ఇప్పుడు బాధ కలుగుతోంది. స్పెషల్‌ కేటగిరి స్టేటల్‌ ఎందుకు ఇవ్వలేదు. పోలవరం ఎందుకు కట్టరు. రైతులకు ఎందుకు అండగా నిలబడరు. చంద్రబాబుపై కోపం ఉంటే ఆయనపై చూపించుకోండి. రాష్ట్ర ప్రజలపై చూపిస్తే ఎలా? బిజెపిని పల్లకి ఎక్కిస్తే నేడు దొడ్డిదారిన వైసిపికి అండగా నిలబడ్డారు. తాము అధికారంలోకి వస్తే మూడు నాలుగేళ్లలో హోదా ఇస్తామని చెప్పారు. తీపికబురు వస్తుందని ఎదురు చూస్తే రెండు లడ్డూలు ఇచ్చారు. అవి పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి. మీ లడ్డూల కంటే బందరు లడ్డులు, కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి.

ప్రజాగళంలో ఇప్పుడేమన్నారు…
అభివృద్ధి లేక అప్పులతో, పాలకుల దాష్టీకంతో, దోపిడీతో, అవినీతితో, అప్రజా స్వామిక విధానాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానీకం ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఎదురుచూస్తోంది. అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి అండగా ఉన్నానని చెప్పడానికి మోడీ వచ్చారు. భుజం కాయడానికి వచ్చిన మోడీకి.. ఐదుకోట్ల మంది ప్రజల కోసం వచ్చిన మోడీకి కరతాళధ్వనులతో స్వాగతం. 2014లో తిరుపతి బాలాజీ వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది. 2024లో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా పొత్తు వేరేరూపం తీసుకోబోతోంది.

 

➡️