దర్యాప్తు సంస్థల బాటలో యుజిసి, ఎన్‌సిఇఆర్‌టి

Dec 12,2023 10:43

స్వామిభక్తితో పునీతమవుతున్న సంస్థలు

హిందూ జాతీయతావాద ఎజెండాతో ముందుకు

న్యూఢిల్లీ :    కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారాన్ని అనుభవించి, ముచ్చటగా మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వ సంస్థలపై బిజెపి ప్రభావం, పెత్తనం సుస్పష్టంగా కన్పిస్తోంది. ప్రతిపక్ష పార్టీలే లక్ష్యంగా చర్యలు చేపట్టడంలో ఇడి, ఐటి, సిబిఐ అధికారులు తలమునకలై పోయారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్‌ కూడా కొన్ని సందర్భాలలో పక్షపాత వైఖరినే ప్రదర్శిస్తోంది. ఇప్పుడు తామేమీ తక్కువ తినలేదన్నట్లు యుజిసి, ఎన్‌సిఇఆర్‌టి స్వామిభక్తిని చాటుకుంటున్నాయి. అధికార పార్టీ రాజకీయ సిద్ధాంతానికి అనుగుణంగా విద్యా వ్యవస్థను, ఆ నిర్మాణాన్ని సమూలంగా మార్చేసే పనిలో ఈ రెండు సంస్థలూ నిమగమయ్యాయి. విద్యార్థులలో హిందూ జాతీయతావాద భావాలను రేకెత్తించాల్సిందిగా విద్యా సంస్థలకు తరచుగా ఆదేశాలు జారీ అవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం విద్యార్థి ఉద్యమాలను నీరుకార్చేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది. ఇలాంటి నిరసనలకు జాతి వ్యతిరేక చర్యలుగా ముద్ర వేస్తోంది. ప్రతి విశ్వవిద్యాలయంలోనూ జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు ఓ పొడవైన పోల్‌ను ఏర్పాటు చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మాజీ మంత్రి స్మృతి ఇరానీ ప్రతిపాదించారు. జేఎన్‌యూ ప్రాంగణంలో విద్యార్థులు చర్చా వేదికలు నిర్వహించే ప్రదేశంలో నిరుపయోగంగా ఉన్న సైనిక ట్యాంకును ఉంచాలని మరో ప్రతిపాదన వచ్చింది. ఇది వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు చెప్పుకునేందుకు విద్యార్థులకు ఓ వేదిక అనేదే లేకుండా చేయాలన్న ఉద్దేశంతో చేసిన ప్రతిపాదన.

ఇటీవలి కాలంలో అనేక సర్క్యులర్లు జారీ అయ్యాయి. ఎబివిపిని స్థాపించిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ దత్తాజీ దిదోల్కర్‌ శత జయంతి ఉత్సవాలలో విద్యార్థులు విధిగా సంవత్సరం పొడవునా పాల్గనాలన్నది అందులో ఒకటి. భారతీయ జాతీయతావాదం కోసం లేదా బ్రిటీష్‌ వలస పాలనపై పోరాడిన వారిని గౌరవిస్తే తప్పేమీ లేదు. దిదోల్కర్‌ ఎన్నడూ స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకోలేదు. స్వతంత్ర భారత రాజ్యాంగంలోని విలువలకు ప్రాతినిధ్యం వహించలేదు. ఇక కొద్ది రోజుల క్రితం జారీ అయిన మరో సర్క్యులర్‌ను చూద్దాం. విద్యా సంస్థలలో ప్రధాని నరేంద్ర మోడీ నేపథ్యంలో ఉండేలా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలట. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సర్క్యులర్లు జారీ అవుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ఈ తరహా వ్యక్తి ఆరాధనా ధోరణులకు తావు లేదు. ఒక పార్టీని, దాని నేతను గురించి ప్రచారం చేయడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం. ఇలా చేయడం ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇది అధికార దుర్వినియోగానికి తార్కాణం. యుజిసి, ఎన్‌సిఇఆర్‌టి ఇంతటితో ఆగలేదు. 7-12 తరగతుల విద్యార్థులకు చరిత్ర పాఠ్యాంశంలో భాగంగా రామాయణం, మహాభారతం బోధించాలట. ఇవి దేశభక్తిని, ఆత్మ గౌరవాన్ని ప్రేరేపిస్తాయట. ఇక ఇండియా పేరును భారత్‌గా మార్చాలన్న యోచన సరేసరి. ఈ విధంగా యుజిసి, ఎన్‌సిఇఆర్‌టి సంస్థలు తలాతోకా లేని ఆదేశాలు జారీ చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయి. హిందూ జాతీయతావాద అజెండాతో రాజ్యాంగ విలువలకు పాతరేస్తున్నాయి.

➡️