అడుగంటిన భూగర్భ జలాలు

Nov 30,2023 07:51 #Under Ground Water, #Water Problem
under ground water problem

సాగు… తాగు నీటికి కటకట
వర్షాభావంతో ప్రమాదకర స్థాయికి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఈ ఏడాది రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలమట్టాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. సాధారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో వుండే స్థాయి కంటే దిగువకు నవంబర్‌లోనే అడుగంటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో బోరుబావుల కింద సాగుతో పాటు ప్రజల తాగునీటికి తీవ్రమైన కొరత ముంచుకురానుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర సగటు భూగర్భ జలాల మట్టం 5.83 మీటర్లు కాగా ప్రస్తుతం 8.53 మీటర్లకు పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటిదాకా సగటున 824.83 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి వుండగా కేవలం 569 మిల్లీమీటర్లు కురిసింది. రాష్ట్రంలో సగటున 31 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీనివల్ల చెరువులు, కుంటలు, సాగునీటి ప్రాజెక్టుల నీటి నిల్వలు తగ్గడంతో భూగర్భ జలాలపైనా ప్రతికూల ప్రభావం చూపింది. రాష్ట్రంలో మేజర్‌ సాగునీటి ప్రాజెక్టుల్లో 865.64 టిఎంసిల సామర్థ్యం కాగా ప్రస్తుతం 340 టిఎంసిలు మాత్రమే అందుబాటులో వున్నాయి. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులు 717 టిఎంసిలతో కళకళలాడాయి. ప్రస్తుతం ప్రాజెక్టులతో పాటు చెరువుల్లోనూ నీరు తగ్గిపోయింది.

రాష్ట్రంలో వున్న 38,372 చెరువులు నీటి సామర్థ్యం 205.58 టిఎంసిలు కాగా ప్రస్తుతం 93 టిఎంసిలు అందుబాటులో వున్నాయి. 6,166 చెరువుల్లో చుక్కనీరు లేదు. 16 వేల చెరువుల్లో 50 శాతం కంటే తక్కువ నీరుంది. 9,800 చెరువుల్లో మాత్రమే పూర్తిస్థాయిలో నీరు వుంది. రాష్ట్రంలో గుంటూరు, బాపట్ల, కోనసీమ, ఎన్‌టిఆర్‌, విజయనగరం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 22.81 మీటర్ల దిగువకు పడిపోయాయి. ఏలూరు జిల్లాలో 20.26 మీటర్లు, ప్రకాశం జిల్లాలో 17.96 మీటర్లు. పల్నాడులో 11.62, అన్నమయ్య జిల్లాలో 11.35, సత్యసాయి జిల్లాలో 11.08 మీటర్లు, అనంతపురంలో 9.79, కృష్ణాలో 8.96, పశ్చిమ గోదావరిలో 8.33 మీటర్లకు తగ్గాయి. కడపలో 8.32 మీటర్లకు చేరాయి. రబీ సీజన్‌లో ఎక్కువ ప్రాంతాల్లో పంటల సాగు బోరుబావుల కిందే ఉంది. రాష్ట్రంలో 18.5 లక్షల బోరుబావుల కింద 41 లక్షల ఎకరాల సాగవుతోంది. భూగర్భ జలాలు పడిపోవడంతో పంటలకు నీరందక ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇప్పటికే మొదలైన తాగునీటి ఎద్దడి సమస్య రానున్న రోజుల్లో మరింత ఆందోళనకరంగా మారే పరిస్థితులు వస్తాయేమోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

➡️