నిరుద్యోగ తాండవం

May 18,2024 10:00 #Business

మార్చి త్రైమాసికంలో 6.7 శాతానికి చేరిక
యువతలో ఏకంగా 17 శాతం
పిఎల్‌ఎఫ్‌ఎస్‌ డేటా వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం తాండవం చేస్తోంది. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఒ) విడుదల చేసిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) గణంకాల ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2023-24 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో దేశంలో నిరుద్యోగ రేటు 6.7 శాతానికి ఎగిసింది. ఇంతక్రితం డిసెంబర్‌ ముగింపు నాటికి ఇది 6.5 శాతంగా నమోదయ్యింది. మోడీ సర్కార్‌ హయంలో ఉపాధి కల్పన తగ్గిందనడానికి ఈ ప్రభుత్వ గణంకాలే నిదర్శనం. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచిందని.. త్వరలోనే జపాన్‌, జర్మనీని దాటి మూడో స్థానంలోకి చేరుకోనుందని మోడీ అనుచర వర్గం చేస్తోన్న ప్రకటనలకు ఉద్యోగాల కల్పనకు పొంతన లేకుండా ఉంది. సాధారణంగా ఆర్థిక వ్యవస్థ పెరిగినప్పుడూ.. ఉద్యోగాల సృష్టి జరగాలి. కానీ ఎన్‌ఎస్‌ఒ గణంకాలు ఆందోళన కలిగించేలా నిరుద్యోగం ఉంది.
ప్రభుత్వంలోని కీలక శాఖ ఎన్‌ఎస్‌ఒ మే 17న విడుదల చేసిన గణంకాల ప్రకారం.. గడిచిన జనవరి ా మార్చి త్రైమాసికంలో కరెంట్‌ విక్లీ స్టేటస్‌ (సిడబ్ల్యుఎస్‌) ప్రకారం.. 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగం 6.8 శాతంగా చోటు చేసుకుంది. ఇదే త్రైమాసికంలో మహిళల్లో నిరుద్యోగం రేటు స్వల్పంగా 8.5 శాతానికి తగ్గింది. పురుషులలో నిరుద్యోగిత రేటు గడిచిన త్రైమాసికంలో 5.8 శాతం నుండి 6.1 శాతానికి పెరిగిందని పిఎల్‌ఎఫ్‌ఎస్‌ డేటా వెల్లడించింది. 15-29 ఏళ్ల యువత నిరుద్యోగిత రేటు 17 శాతానికి చేరింది. డిసెంబర్‌ త్రైమాసికంలో ఇది 16.5 శాతంగా ఉంది.
2024 మార్చి త్రైమాసికంలో పట్టణ జనాభాలో పని చేసే లేదా ఉపాధిని కోరుకునే వ్యక్తుల వాటా 50.2 శాతానికి చేరింది. ఇంతక్రితం ఇది 49.9 శాతంగా ఉంది. కాగా.. పట్టణ జనాభాలో స్వయం ఉపాధి కూడా 40.6 శాతానికి తగ్గింది. అంతక్రితం డిసెంబర్‌ త్రైమాసికంలో ఇది 40.5 శాతంగా ఉంది. పిఎల్‌ఎఫ్‌ఎస్‌ ప్రకారం.. 2024 జనవరి – మార్చి కాలంలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగం స్వల్పంగా 6.8 శాతానికి తగ్గింది. 2023 మార్చి-జనవరిలో ఇది 6.7 శాతంగా ఉంది.
దేశంలో ముఖ్యంగా యువతలో నిరుద్యోగం అమాంతం పెరుగుతోందని ముంబయి కేంద్రంగా పని చేస్తోన్న సెంటర్‌ ఫర్‌ మానిటరీంగ్‌ ఇండియన్‌ ఎకనామీ (సిఎంఐఇ) ఈ ఏడాది జనవరిలో ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. 2023 అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ త్రైమాసికంలో 20-24 ఏళ్ల మధ్య యువతలో నిరుద్యోగం 44.49 శాతానికి ఎగిసినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో 25-29 ఏళ్ల యువతలో 13.35 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. 2024 డిసెంబర్‌ త్రైమాసికంలో 14.33 శాతానికి ఎగిసి.. మూడున్నరేళ్ల గరిష్ట స్థాయికి.. అంటే కోవిడ్‌ నాటి స్థాయికి ఎగిసినట్లు విశ్లేషించింది. 30-34 మధ్య యువతలో నిరుద్యోగం 2.06 శాతం నుంచి 2.49 శాతానికి పెరిగి.. రెండున్నరేళ్ల గరిష్ట స్థాయికి ఎగిసింది.

➡️