Unemployment: నిరుద్యోగమే ప్రధాన సమస్య

Mar 28,2024 08:17 #BJP Failures, #BJP Govt, #Unemployment
  •  ఓటర్లపై ప్రభావం చూపే అంశం ఇదే 
  • తర్వాతి స్థానంలో ద్రవ్యోల్బణం 
  • ఉద్యోగ కల్పనలో మోడీ విఫలం 
  • లోక్‌నీతి-సిఎస్‌డిసి సర్వేలో రాజధాని ఓటర్ల మనోగతం

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర బిజెపి నేతలు ప్రధానంగా పేదలు, యువత, మహిళలు, రైతులను దృష్టిలో పెట్టుకొని హామీల వరద పారిస్తున్నారు. ఈ నాలుగు సెక్షన్లే ప్రధానమంటూ ఓటర్లను నమ్మించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యువ ఓట్లపై కన్నేసి, ప్రధాని 110వ ‘మన్‌ కీ బాత్‌’లోనూ హితబోధ చేశారు. బిజెపి అజెండా నిజంగానే యువత ముఖ్యంగా నిరుద్యోగుల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్నదా? లోక్‌నీతి- సిఎస్‌డిసి ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన సర్వే అందించిన వివరాలను పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీ ఓటర్ల నాడి తెలుస్తోంది. ఢిల్లీలోని 611 మంది విద్యార్థులను ప్రశ్నించి వారి నుండి సమాచారాన్ని రాబట్టారు.

ఉద్యోగం సంపాదించడం కష్టమే

ఇటీవలి కాలంలో ఉద్యోగావకాశాలు పరిమితమై పోయాయని యువత అభిప్రాయపడింది. గత రెండేళ్లలో ఉద్యోగం సంపాదించడం కష్టమైందని 55% మంది అభిప్రాయపడగా, బాగా కష్టమైపోయిందని 25% మంది చెప్పారు. ఉద్యోగం సులభంగానే దొరుకుతోందని 16% మంది, చాలా తేలికగా దొరుకుతోందని 3% మంది అన్నారు. దేశం ఆర్థికాభివృద్ధి సాధిస్తోందని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ ఉద్యోగ కల్పన అనేది అతి పెద్ద సవాలుగా మారింది. చాలా మంది యువతీ యువకులు ఉద్యోగావకాశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ విద్యార్హతకు తగిన ఉద్యోగాలు లభించడం లేదన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది.

ప్రభుత్వోద్యోగమే బెటర్‌

విద్యార్హతలకు తగిన ఉద్యోగం లభిస్తుందని 24% మంది మాత్రమే ఆశాభావంతో ఉన్నారు. ఆ అవకాశం కొంత వరకూ ఉన్నదని 49% మంది అంటే, పెద్దగా లేదని 16% మంది చెప్పారు. 10% మంది మాత్రం తమ చదువుకు, దొరికే ఉద్యోగానికి సంబంధమే ఉండదని కుండబద్దలు కొట్టారు. భద్రతతో కూడిన స్థిరమైన ఉద్యోగాలు కావాలని యువత కోరుకుంటోంది. ప్రతి ఐదుగురిలో ముగ్గురు ప్రభుత్వోద్యోగాన్ని ఆశిస్తున్నారు.

ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలి

ఉద్యోగాలు కోరుకునే స్థితి నుండి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువతను తీసికెళ్లాలని, అప్పుడే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని బిజెపి అంటోంది. నిరుద్యోగ యువతలో 47% మంది ఉద్యోగాల సృష్టికర్తలు కావాలని, 27% మంది ఉద్యోగాలు చేసేందుకే ఇష్టపడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వడానికి అవసరమైన వనరులు లేవని 12% మంది స్పష్టం చేశారు. ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఉద్యోగాలు ఇవ్వడాన్నే ఇష్టపడతామని చెప్పారు. మహిళల్లో మాత్రం అలా చెబుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. ప్రతి ఐదుగురిలో ఇద్దరు మాత్రమే తాము ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలని కోరుకుంటున్నారు. ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని కామర్స్‌ విద్యార్థులు ఎక్కువగా (54%) ఆశిస్తున్నారు. సైన్స్‌ (48%), ఆర్ట్స్‌ (39%) విద్యార్థులు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

మోడీ సర్కారు వైఫల్యం

ఉద్యోగాలు ఎవరు కల్పించాలని అడిగిన ప్రశ్నకు మెజారిటీ విద్యార్థులు, యువత ప్రభుత్వమేనని సమాధానం చెప్పారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలని 30% మంది అంటే ప్రతి పది మందిలో ముగ్గురు చెప్పారు. అరవిండ్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానిదే ఆ బాధ్యత అని 14% మంది తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వాల్సింది ప్రభుత్వాలు కాదని, ప్రజలేనని 35% మంది అభిప్రాయపడ్డారు. ఉద్యోగ కల్పనలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని 16% మంది స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం ప్రయత్నించినా, విఫలమైందని 55% మంది చెప్పారు. ఉద్యోగ కల్పనలో కేంద్రం విజయవంతమైందని కేవలం 25% మంది మాత్రమే తెలిపారు.

ఓటింగ్‌పై ప్రభావం చూపేవి ఇవే

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రధాన సమస్యలుగా ఉన్నాయని రాజధానిలోని యువ ఓటర్లు తెలియజేశారు. తమ ఓటింగ్‌ నిర్ణయంపై ఈ అంశాలు ప్రభావం చూపుతాయని ప్రతి ఐదుగురిలో నలుగురు చెప్పారు. ఈ రెండింటిలోనూ నిరుద్యోగ సమస్యనే వారు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఓటింగ్‌ నిర్ణయంపై నిరుద్యోగం ప్రభావం చూపుతుందని 41% మంది, ద్రవ్యోల్బణం ప్రభావం చూపుతుందని 23% మంది చెప్పారు. నరేంద్ర మోడీ నాయకత్వం ప్రభావం 12% మాత్రమేనని యువత తెలిపారు. తమ ఓటింగ్‌పై అవినీతి ప్రభావం చూపుతుందని 9% మంది, రామమందిరం ప్రభావం చూపుతుందని 5% మంది, మతపరమైన గుర్తింపు ప్రభావం చూపతుందని 2% మంది అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ప్రభావం కేవలం ఒక శాతం మాత్రమేనని చెప్పారు. సర్వే వివరాలను విశ్లేషిస్తే నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉన్నదని అర్థమవుతోంది.

➡️