చేనేత…అధోగతి..!

Feb 15,2024 08:17 #Handloom worker, #problems, #Stories
Weaver problems in ap

ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : ‘చేనేత వృత్తి రక్షణకు అవసరమైన రాయితీలను ప్రభుత్వం నిలిపివేయడం సమస్యగా మారింది. ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడడంతో చేనేత వస్త్రాలు నేతన్నలకు భారంగా మారాయి. దీని ప్రభావంతో వస్త్ర విక్రయాలు మందగించి ఉత్పత్తులు క్రమక్రమంగా క్షీణించిపోతున్నాయి. కృష్ణా జిల్లాలో ఐదేళ్ల ఉత్పత్తులను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లం అవుతుంది. చేనేత కార్మికులకు చెల్లించే మజూరీ రోజువారీ కుటుంబ పోషణకు చాలక వారు ఇతర వృత్తులలోకి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ‘నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. సొంత మగ్గాలపై నేత నేసే నేతన్నలకు ఒక్కొక్కరికి నెలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.24 వేలు అందిస్తోంది. అయితే చేనేత వృత్తి సంరక్షణకు గతంలో ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను నిలిపివేసింది. వస్త్ర ఉత్పత్తులకు అవసరమైన ముడి నూలుపై ఉన్న 40 శాతం సబ్సిడీని, పండుగల సమయంలో వస్త్ర ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించేందుకు ఇచ్చే 30 శాతం రాయితీని నిలిపివేసింది. దీంతో 2019లో రూ.1,000 విలువ కలిగిన చేనేత వస్త్రాల ధర తాజాగా రూ.1300కు చేరింది. ఇది మార్కెట్‌పై ప్రభావం చూపింది. వస్త్ర విక్రయాలు మందగించాయి. గతంలో నెలకు లక్ష రూపాయల వరకు విక్రయించే అతిపెద్ద సొసైటీల్లోనూ రూ.65 వేల నుంచి రూ.70 వేలకు అమ్మకాలు పడిపోయాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 37 సొసైటీల్లో 21 లక్షల 41 వేల మీటర్ల వరకు వస్త్రాల ఉత్పత్తి జరిగితే, గత ఆర్థిక సంవత్సరంలో 15 లక్షల 40 వేల మీటర్లకు ఉత్పత్తి తగ్గింది. ఆరు లక్షల మీటర్లకుపైగా ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ వరకు గడిచిన తొమ్మిది నెలల కాలంలో జరిగిన ఉత్పత్తిలోనూ ఎటువంటి పురోగతీ కనిపించలేదు.

Weaver problems in ap a

చేనేత కార్మికుల ఆదాయాలపై ప్రభావం

గతంలో పూర్తి స్థాయిలో సొసైటీలకు ఆర్డర్లు వచ్చినప్పుడు ఒక్కో కార్మికుడికి రోజుకు సగటున రూ.500 నుంచి రూ.600 వరకు మజూరీ వచ్చేది. ఆర్డర్లు మందగించడంతో వారి ఆదాయం రోజుకు రూ.300కు తగ్గిపోయింది. ఈ క్రమంలోనే నేత కార్మికుల్లో అత్యధికులు ఇతర వృత్తులకు మళ్లిపోతున్నారు. కలంకారీకి ప్రసిద్ధి చెందిన పెడనలో ఒకప్పుడు 7,100 ఉన్న మగ్గాలు క్రమేణా 1,500కు తగ్గాయి. పెడన, గూడూరు ప్రాంతాలకు చెందిన నేత కార్మికులు ఎక్కువ మంది మచిలీపట్నంలో నిర్మాణ పనుల్లో, హోటళ్లలో సప్లయిర్లుగా చేరిపోయారు.

రాయితీలను పునరుద్ధరించి, జిఎస్‌టి తొలగించాలి : సజ్జా నాగేశ్వరరావు, ఎపి చేనేత కార్మిక సంఘం పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు

చేనేతకు గతంలో ఇచ్చే రాయితీలను ప్రభుత్వాలు నిలిపివేశాయి. చౌకగా దొరికే పవర్‌లూమ్‌ వస్త్రాలతో పోటీ పడడం కష్టంగా మారింది. పండగల రిబేటు, నూలు రాయితీలు పునరుద్దరించడంతోపాటు చేనేత తయారీకి అవసరమైన నూలుపై విధించిన 5 శాతం జిఎస్‌టి, రంగులు, రసాయనాలపై విధించిన 18 శాతం జిఎస్‌టి, కార్మికుల మజూరీపై విధించిన 5 శాతం జిఎస్‌టిని రద్దు చేయాలి. అప్పుడే పవర్‌లూమ్‌ వస్త్రాల పోటీని తట్టుకుని చేనేత మనగలుగుతుంది.

➡️