ఎంత తేడా ?!

Jan 22,2024 12:11 #ayodya
  • నాడు సోమనాథ్‌లో ప్రాణ ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇవ్వని నెహ్రూ
  • అక్కడికి వెళ్లవద్దని అప్పటి రాష్ట్రపతికి సూచన
  • గైర్హాజరైన పలువురు ప్రముఖులు
  • నేడు రాజకీయ కార్యక్రమంగా అయోధ్య ఈవెంట్‌
  • ఊదరకొడుతున్న కార్పొరేట్‌ మీడియా

1951లో సోమనాథ్‌ దేవాలయంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠకు, ఇప్పుడు అయోధ్యలో జరుగుతున్న అదే తరహా కార్యక్రమానికి మధ్య ఎంత తేడా ?!. నాటి కార్యక్రమానికి అప్పటి ప్రధాని నెహ్రూ ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. పైగా దానికి హాజరు కావద్దని రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌కు సలహా ఇచ్చారు. మరి నేడో… అయోధ్య వెళ్లడమే గొప్పగా నాయకులు భావిస్తున్నారు. దానిని ఓ రాజకీయ ఈవెంట్‌గా మార్చేశారు. మీడియా సంస్థలు సైతం విపరీతమైన హైప్‌ సృష్టించి తమ వంతు సాయం చేస్తున్నాయి. వెరసి…అయోధ్యలో అంతా మోడీమయంగా కన్పిస్తోంది.

న్యూఢిల్లీ : ప్రజల నుండి సేకరించిన విరాళాల ద్వారా మాత్రమే సోమనాథ్‌ దేవాలయాన్ని పునరుద్ధరించాలని సర్దార్‌ వల్లభారు పటేల్‌ భావించారు. 1951లో ఆ ఆలయానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు అయోధ్యలో జరుగుతున్నది ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సోమనాథ్‌ దేవాలయం ఎన్నో పాఠాలు నేర్పుతోంది.

ఏదో ఒక మత విశ్వాసానికి ప్రాతినిధ్యం వహించే ప్రార్థనా మందిరం కోసం ప్రభుత్వ నిధులను వెచ్చించకూడదని మహాత్మా గాంధీ ఇచ్చిన సలహాను పటేల్‌ పాటించారు. మతం విషయంలో తటస్థ వైఖరి ప్రదర్శించాలన్నది గాంధీ అభిప్రాయం. 1947 నవంబర్‌ 28న ఢిల్లీలో జరిగిన ప్రార్థనా సమావేశంలో సోమనాథ్‌ దేవాలయ పునరుద్ధరణను ప్రస్తావిస్తూ ఆయన ఇదే మాట చెప్పారు. స్వాతంత్య్రానంతరం ఏర్పడిన ప్రభుత్వం వివిధ మత విశ్వాసాలను అనుసరిస్తున్న భారతీయులందరిదీ అని ఆయన అన్నారు. ‘ఇది లౌకిక ప్రభుత్వం. ఇది ఏ మతానికీ సంబంధించింది కాదు’ అని స్పష్టం చేశారు.

నెహ్రూ ఏమన్నారు ?

సోమనాథ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొనడాన్ని ప్రధాని నెహ్రూ ఇష్టపడలేదు. 1951 మే 11న సోమనాథ్‌ దేవాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని, దానిని ప్రారంభించాలని అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌కు ఆహ్వానం అందింది. దీనిపై ఆయన ప్రధాని నెహ్రూ అభిప్రాయాన్ని కోరారు. ఆ కార్యక్రమానికి హాజరు కావద్దని రాజేంద్ర ప్రసాద్‌కు నెహ్రూ సలహా ఇచ్చారు. భారత రిపబ్లిక్‌ అధిపతిగా దేశ లౌకిక స్వభావానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేశారు. ఒకవేళ ఆ కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరైతే పరిపాలనకు సంబంధించిన లౌకిక స్వభావానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్లు అవుతుందని భావించారు.

సోమనాథ్‌ దేవాలయంలో కార్యక్రమం జరగడానికి 19 రోజుల ముందు… అంటే 1951 ఏప్రిల్‌ 22న… రాజేంద్ర ప్రసాద్‌కు నెహ్రూ ఓ లేఖ రాశారు. సోమనాథ్‌ వ్యవహారాలపై తన ఆందోళనను అందులో వ్యక్తం చేశారు. ‘నేను భయపడుతున్నట్లుగానే ఈ కార్యక్రమం కొంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది’ అని తెలిపారు. ప్రపంచ దేశాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని గురించి చెప్పుకుంటున్నారని వివరించారు. ‘మనలాంటి లౌకిక ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై మనల్ని ప్రశ్నిస్తున్నారు’ అని తెలిపారు. పార్లమెంటులో కూడా ఈ అంశంపై తనను అనేక ప్రశ్నలు వేశారని, ఈ కార్యక్రమంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పానని, ఎవరైనా వెళ్లినా అది వారి వ్యక్తిగతమని తెలియజేశానని వివరించారు.

భిన్న వైఖరులు

అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో 73 సంవత్సరాల క్రితం నెహ్రూ చేసిన వ్యాఖ్యల్ని గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పటి బాబ్రీ మసీదును కూలదోసి అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు. మందిర నిర్మాణాన్ని అనుమతిస్తూనే బాబ్రీ మసీదు కూల్చివేత చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయోధ్య కార్యక్రమంలో ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, వివిధ రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు భాగస్వాములవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇది ఓ రాజకీయ కార్యక్రమంగా మారిపోయింది. సోమనాథ్‌ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నెహ్రూను నాటి సౌరాష్ట్ర ప్రభుత్వాధినేత (రాజ్‌ప్రముఖ్‌) దిగ్విజరు సింగ్‌ ఆహ్వానించారు. అందుకు ఆయన నిరాకరించారు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు తమకు ఆహ్వానం అందడాన్నే ప్రధాని మహద్భాగ్యంగా, గర్వకారణంగా భావిస్తున్నారు. సోమనాథ్‌ కార్యక్రమానికి హాజరైతే విదేశాల్లోనే కాక స్వదేశంలోనూ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని నెహ్రూ భావించారు. సోమనాథ్‌ ఆలయ పునర్నిర్మాణానికి మట్టి, నదుల నుండి నీరు పంపాలంటూ వివిధ దేశాల్లోని భారత రాయబారులకు రాజ్‌ప్రముఖ్‌ నేరుగా లేఖలు రాయడంపై నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అభ్యర్థనలు దేశానికి అవమానకరమని అన్నారు. దేశంలోని ఓ దేవాలయాన్ని విదేశీ మట్టి, నీటితో ఎలా పునర్నిర్మిస్తారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నెహ్రూ మాత్రమే కాదు… సర్వేపల్లి రాధాకృష్ణన్‌, సి.రాజగోపాలాచారి, మృదులా సారాభారు వంటి పలువురు ప్రముఖులు సైతం సోమనాథ్‌ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కారాదని నిర్ణయించుకున్నారు.

మరి ఇప్పుడు అయోధ్యలో జరుగుతోంది ఏమిటి? పైగా కార్పొరేట్‌ సంస్థల నియంత్రణలో ఉన్న టీవీ ఛానల్స్‌, పత్రికలు అయోధ్య కార్యక్రమానికి విశేష ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నాయి. అదే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల్ని గాలికి వదిలేశాయి. సోమనాథ్‌ కార్యక్రమం కవరేజిపై అప్పటి ప్రధాని నెహ్రూ మీడియా సంస్థలకు పలు ఆదేశాలు జారీ చేశారు. దానిని ఓ ప్రభుత్వ కార్యక్రమంగా చూపవద్దని సూచించారు. ఇప్పుడు మోడీ వ్యవహరిస్తున్న తీరు దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఆకాశమే హద్దుగా మీడియా సంస్థలు అయోధ్యపై కుప్పలు తెప్పలుగా కథనాలు వండి వారుస్తున్నాయి.

➡️