జల’కళ’ ఏదీ ?

Mar 30,2024 08:53 #water
  • బిల్లులు రాక పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు
  • 12శాతం లక్ష్యం దాటని బోర్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బీడు భూములకు నీటి వసతిని కల్పించేందుకు ఉచితంగా బోరుబావులను తవ్వించి పేదరైతులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన వైఎస్సార్‌ జలకళ పథకం ఆచరణలో కలతప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రెండు లక్షల బోర్లను ఉచితంగా తవ్వి విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తామని, ఇందుకుగాను ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. పేద రైతులను ఆదుకునేందుకే తమ ప్రభుత్వం వైఎస్సార్‌ జలకళను చేపట్టిందని 2020 సెప్టంబర్‌ 28న సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. బోర్లు వేయడమే కాదు విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం రైతులనుండి దరఖాస్తులను తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,32,789 మంది రైతులు వైఎస్సార్‌ జలకళ పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటిదాకా కేవలం 23,115 బోరుబావులను మాత్రమే తవ్వించింది. అంటే లక్ష్యం 12శాతం దాటని పరిస్థితి. మొదటి ఏడాదిలోనే వైఎస్సార్‌ జలకళ పథకంలో బోర్లుతవ్విన కాంట్రాక్టర్లకు బిల్లులు అరకొరగా చెల్లించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు బోర్లు తవ్వితే బిల్లులు రావని జలకళ పథకానికి మంగళం పాడేశారు. మొదట్లో విద్యుత్‌ కనెక్షన్‌ను ఉచితంగా ఇస్తామన్న ప్రభుత్వం ఆ తర్వాత విద్యుత్‌ కనెక్షన్‌ను రైతులే భరించాలనే నిబంధన పెట్టడంతో రైతులు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. జలకళ కింద బోర్లు వేసుకున్న రైతుల్లో కేవలం 3,500 మందికి మాత్రమే విద్యుత్‌ మోటార్లను అమర్చారు. ప్రారంభించిన ఏడాదిలో బిల్లులు వస్తాయని ఆశించిన కాంట్రాక్టర్లకు ఇప్పటిదాకా బిల్లులు చెల్లించని పరిస్థితి నెలకొంది. చాలా నియోజకవర్గాల్లో బిల్లులు తామే ఇప్పిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని వేయించిన బోర్లకు ఇప్పటిదాకా బిల్లులను చెల్లించని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు రూ70 కోట్ల దాకా బిల్లులను చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం అధికారులు, మంత్రులు చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్భాటంగా చేపట్టిన వైఎస్సార్‌ జలకళ పథకం లక్ష్యం 12శాతం మించని పరిస్థితి నెలకొంది.

➡️