పోలీస్‌ అకాడమీ ఎక్కడ ?

Dec 26,2023 10:14 #AP police, #police academy
  •  కేంద్రం నుంచి రాని నిధులు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : శాంతిభద్రతలకు అత్యంత కీలకమైన, కొత్త పోలీసులకు శిక్షణనిచ్చేందుకు అవసరమైన అకాడమీ ఉనికి రాష్ట్రంలో కనిపంచడంలేదు. విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీ (అప్పా) తెలంగాణకు పరిమితమైంది. ఆ తరువాత రాష్ట్రంలో నూతన అకాడమీ ఏర్నాటు కాలేదు. దీంతో పోలీస్‌ అధికారుల శిక్షణ ప్రశ్నార్ధకంగా మారింది. 1986లోనే హైదరాబాద్‌లో 175 ఎకరాల సామర్థ్యంతో అప్పాను ఏర్పాటుచేశారు. పోలీసు అధికారులకే కాకుండా ఎన్‌ఫోర్స్‌మెరట్‌ ఏజెన్సీలు, ఫోరెన్సిక్‌ నిపుణులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు అక్కడ శిక్షణ ఇచ్చేవారు. విభజన అనంతరం పదో షెడ్యూల్‌లో ఉన్న అకాడమీని భౌగోళిక హక్కుల కింద తెలంగాణకు కేటాయించారు. అయితే, దానికి సంబంధించిన ఆస్తుల పంపకాలు మాత్రం ఇంకా జరగలేదు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌లో నూతన అకాడమీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలితాలు కనిపించలేదు.. చివరకు గత ఫిబ్రవరిలో అకాడమీకి 185 పోస్టులను భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే నిర్మాణమే ఇంకా జరగని తరుణంలో ఈ పోస్టుల భర్తీకి కూడా ఉన్నతాధికారులు పెద్దగా ఆశక్తి చూపించడం లేదని తెలుస్తోంది. విభజన చట్టం మేరకు అకాడమీని ఏర్పాటు చేసేందుకు 2020 డిసెంబర్‌లోనే కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు కూడా పంపించిరది. భవనాల కోసం రూ.590 కోట్లు ఇవ్వాలని కోరింది. అయితే మూడేళ్లు ముగిసినా ఇప్పటివరకు ఆ నిధులపై కేంద్రం నురచి ఎటువంటి స్పష్టమైన సంకేతాలు రాలేదని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.

బడ్జెట్‌లో 3.57 కోట్లే

ఇలా ఉండగా అకాడమీ నిర్వహణకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.57 కోట్లను కేటాయించారు. ఇది కేవలం ఉన్న కొద్దిపాటి మంది జీతాలకి.. ఇతర నిర్వహణ వ్యయానికి మాత్రమేనని సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అకాడమీ అధికారులు ఆర్థికశాఖకు పలు ప్రతిపాదనలు పంపించారు. ముందుగా ఎస్సై స్థాయి నుంచి ఐపిఎస్‌ అధికారుల స్థాయి వారికి శిక్షణ కోసం స్థలాన్ని కేటాయిరచాలని ప్రతిపాదించారు. వంద నుంచి 200 ఎకరాల భూమి కావాల్సి ఉంటుందని ఆ ప్రతిపాదనల్లో పేర్కొనడం విశేషం. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం, కేంద్రం నుంచి నిధులు రావడం జరిగితేనే పోలీస్‌ అకాడమీ సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

➡️