మెడికల్‌ కాలేజీల స్వప్నం సాకారమయ్యేనా ?

రాష్ట్రంలో మరో ఐదు వైద్య కళాశాలల ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లిలో నిర్మించిన వైద్య కళాశాలల్లో ఈ ఏడాది నుండే తరగతుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసి – గతంలో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా)కు లేఖ రాసింది. మరో ఒకటి, రెండు నెలల్లో నిపుణుల బృందం ఈ కళాశాలల తనిఖీకి రానుందని సమాచారం. దీంతో ఈ కళాశాలల్లో అవసరమైన వసతులను పూర్తిచేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రభుత్వం చేపడుతోంది. దీనిలో భాగంగా బోధన, బోధనేతర సిబ్బంది నియమాకాలను చేపట్టింది. అయితే, వైద్య కళాశాలలకు అత్యంత కీలకమైన మౌలిక వసతులు నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. పాడేరు మినహా మిగిలిన చోట్ల అంతంతమాత్రంగానే ఈ పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుండి పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ఎంసిఐ బృందం వచ్చేలోపల పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని అధికారులు చెబుతున్నా, నిధులతో కూడుకున్న సమస్య కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మొదటి సంవత్సరం విద్యాబోధనకు అవసరమైన వసతులను పూర్తిచేసి, మిగిలిన వాటిని మరింత సమయాన్ని కోరే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనికి ఎన్‌ఎంసి నుండి కూడా అభ్యంతరం ఉండే అవకాశం లేదని అంటున్నారు.

ప్రజాశక్తి – యంత్రాంగం : మార్కాపురం మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు దాదాపు 50 శాతం పూర్తయాయి. మరో ఏడాదిలో పూర్తిస్థాయి నిర్మాణం పూర్తవుతుందని చెబుతున్నారు . నిర్వహణలో భాగంగా మార్కాపురంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలను ప్రభుత్వ సర్వజన వైద్యశాలగా మార్చడం జరిగింది. అందుకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపరిచారు. కొందరు డాక్టర్ల నియమించారు. గుండె, ఇతర ముఖ్యమైన విభాగాలకు చెందిన వైద్యుల నియామకం ఇంకా జరగాల్సి ఉంది. రాయవరం వద్ద నిర్మిస్తున్న కళాశాల భవనాలు పూర్తయ్యేలోగా పాత ఆస్పత్రి ప్రాంగణంలో కల్పించిన వసతుల తో మెడికల్‌ కళాశాలను నిర్వహిస్తామని చెబుతున్నారు. దీనికి సంబంధించి 60 మంది సిబ్బందిని వివిధ విభాగాల్లో ఇప్పటికే నియమించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ రాజమునార్‌ ‘ప్రజాశక్తి’కి తెలిపారు.

మరో రెండు నెలల్లో ‘ఆదోని’లో పనులు
ఆదోనిలో వైద్యకళాశాల పనులు ఇంకా పూర్తికాలేదు. ప్రాధాన్యత ప్రాతిపదికన మరో రెండు నెలల్లో (జులై నెలాఖరుకు) పనులను పూర్తిచేస్తామని అధికారులు అంటున్నారు. 450 పడకల సామర్ధ్యంతో, 475 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ కళాశాల నిర్మాణ పనుల్లో ఇప్పటి వరకు ఒక బ్లాకులో మూడు ఫ్లోర్లు శ్లాబ్‌ వరకు పనులు అయ్యాయి. బాలికల హాస్టల్‌ ఆరు ఫ్లోర్లు, బాలుర హాస్టల్‌ రెండు ఫోర్లు శ్లాబ్‌ పనులు పూర్తయ్యాయి. కిచెన్‌ పనులు ఇంకా బేస్‌మెంట్‌ స్థాయిలోనే ఉన్నాయి. అత్యవసర విభాగం, ఇఎస్‌ఎస్‌ 1, 2 పనులు కూడా ఇంకా బేస్‌మెంట్‌ స్థాయిలోనే ఉన్నాయి. మొత్తం పనులు పూర్తికావడానికి ఇంకా ఒకటిన్నర సంవత్సరం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రాధాన్యత పనులు జులై ఆఖరికి పూర్తయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. నీటి సమస్య సహా నిధుల కొరత కారణంగానే మెడికల్‌ కళాశాల పనులు మందకొడిగా సాగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

పులివెందుల, మదనపల్లిలో మొదటి విడత భవనాలు
వైఎస్‌ఆర్‌ జిల్లాలోని పులివెందుల, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గ కేంద్రాల్లో భవనాల నిర్మాణం జరుగుతోంది. మూడు విడతలుగా భవనాల నిర్మాణం చేపట్టగా మొదటి విడత భవనాలు మాత్రం పూర్తయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థుల అవసరాలకు ఇవి సరిపోతాయని చెబుతున్నారు. ఎనిమిది డిపార్టుమెంట్లకు ఫేజ్‌-1 భవనాలోనే వేరువేరు గదులను కేటాయించారు. ల్యాబ్స్‌, లైబ్రరీ, హాస్టల్స్‌ గదులకు సంబంధించిన ఏర్పాట్లలో వైద్య కళాశాల అధికార యంత్రాంగం నిమగమైంది. ఒటి, ల్యాబ్స్‌ సదుపాయాలకు సంబంధించిన మిషనరీస్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అడ్మిషన్ల నాటికి పూర్తి స్థాయిలో మౌలిక వసతులను ఏర్పాట్లు చేస్తామని వైద్య కళాశాల యంత్రాంగం చెబుతోంది. వైద్య కళాశాలల్లో రోడ్లు, తాగునీటి సదుపాయాలను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాల్సిఉంది.

పాడేరు కళాశాల పనులు చకచకా
అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో రూ.500 కోట్లతో తలపెట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. తొలి సంవత్సరం పురుష విద్యార్థుల కోసం 120 గదులు, విద్యార్థినుల కోసం 135 గదులను, హాస్టల్‌ భవనాలను, డైనింగ్‌ రూమ్స్‌ను సిద్ధం చేశారు. తరగతుల కోసం నాలుగు లెక్చర్‌ హాల్స్‌ పూర్తయ్యాయి. అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల కోసం మూడు ల్యాబ్‌లు నిర్మాణమయ్యాయి. కళాశాల, ఆసుపత్రి సిబ్బంది కోసం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ప్లాట్స్‌ 20, ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ప్లాట్స్‌ 8 చొప్పున నిర్మించారు. సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్ల కోసం 50 సింగల్‌ రూమ్‌ క్వార్టర్లు, వర్కింగ్‌ నర్సుల కోసం 35 సింగిల్‌ రూమ్‌ క్వార్టర్లు నిర్మాణం పూర్తి చేశారు. సిబ్బంది, డాక్టర్ల వసతితోపాటు మొదటి సంవత్సరం విద్యార్థులకు అవసరమైన ఈ భవనాలకు సంబంధించి ప్రస్తుతం టైల్స్‌ వర్క్‌, ఎలక్ట్రికల్‌ వర్క్‌ వంటి పనులు చివరి దశలో ఉన్నాయి. ఫ్యాకల్టీ నియామకం కూడా 75 శాతం వరకూ పూర్తయిందని ఈ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ హేమలతాదేవి ‘ప్రజాశక్తి’కి తెలిపారు. అలాగే వైద్య కళాశాలలో తరగతుల నిర్వహణకు అవసరమైన పరికరాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలిపారు. వైద్య కళాశాలకు అటాచ్డ్‌ ఆసుపత్రిని 425 పడకలతో సిద్ధం చేసినట్లు చెప్పారు.
అనుమతులన్నీ వస్తే ఆగస్టు నాటికి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబిబిఎస్‌ తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. కళాశాలలో ప్రస్తుతం ప్రొఫెసర్లు 17 మంది అవసరంకాగా, 8 మంది ఉన్నారు. అసోసియేట్‌ ప్రొఫెసర్లు 27 మందికిగాను 16 మంది, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 42కిగాను 32 మంది, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు 58కిగాను ముగ్గురు ఉన్నారు. జూనియర్‌ రెసిడెంట్లు/ ట్యూటర్లు 23 పోస్టులకుగాను ఒక్కటీ భర్తీ కాలేదు. త్వరలోనే వీటిని భర్తీ చేస్తామనున్నారు.

➡️