ఆరంభ వేడుకలకు చెపాక్‌ స్టేడియం ముస్తాబు

Mar 21,2024 11:03 #2024 ipl, #Cricket, #Sports

శుక్రవారం నుంచి ఐపిఎల్‌ సీజన్‌-17 టోర్నమెంట్‌

చెన్నై: గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) ఆరంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు బిసిసిఐ ఏర్పాట్లు పూర్తి చేసింది. చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం (చెపాక్‌)ను మిరుమిట్లు గొలిపే దీపకాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకల్లో బాలీవుడ్‌ స్టార్స్‌ అక్షయ్ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌తోపాటు ప్రముఖ సంగీత దర్శఖుడు ఏఆర్‌ రెహమాన్‌, సింగర్‌ సోనూ నిగమ్‌ ఆటపాటలతో సందడి చేయనున్నారు. 22న (శుక్రవారం) సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభోత్సవ వేడుకలు మొదలవుతాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ారాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌కు ముందు ఈ వేడుకలు జరగనున్నాయి. ఆరంభ వేడుకలు ముగిసిన అనంతరం 7:30 గంటలకు మ్యాచ్‌ టాస్‌ వేస్తారు. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది.బెంగళూరుాచెన్నై మ్యాచ్‌పైనే అందరి దృష్టి మార్చి 22న బెంగళూరు-చెన్నై జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ఏడాది సీజన్‌ ప్రారంభం కానుండగా.. శనివారం(23న) పంజాబ్‌ కింగ్స్‌ాఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య మొహాలీ స్టేడియంలో, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌-సన్‌రైజర్స్‌ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఆదివారం(24న) రాజస్తాన్‌ రాయల్స్‌ాలక్నో జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌-ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య మరో మ్యాచ్‌ జరగనుంది. శుక్ర, శని, ఆదివారం కలిపి కేవలం మూడు రోజుల్లో ఐపిఎల్‌లో ఆడే 10జట్లు తమ తొలి లీగ్‌ మ్యాచ్‌లను ఆడనున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ఈ కాలంలోనే జరగనుండడంతో బిసిసిఐ కేవలం 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ఇప్పటివరకు విడుదల చేసింది. ఈసారి కూడా ఎన్నికలు ఏడు దశల్లో జరగనుండడంతో ఎన్నికలు పూర్తియిన రాష్ట్రాల్లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించేందుకు బిసిసిఐ కసరత్తు చేస్తోంది.

సన్‌రైజర్స్‌ రాత మారేనా..!

స్టార్‌ ఆటగాళ్లతో సీజన్‌-17కు సిద్ధం

గత రెండు సీజన్‌లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈసారి ఎలాగైనా మంచి ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో జట్టులో భారీ మార్పులు చేసింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాను వన్డే ప్రపంచకప్‌, డబ్ల్యూటీసీ ఛాంపియన్‌గా నిలిపిన పాట్‌ కమిన్స్‌ను వేలంలో రూ.20.50 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు మార్‌క్రమ్‌ స్థానంలో కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించింది. సౌతాఫ్రికా టి20లీగ్‌లో సన్‌రైజర్స్‌కు వరుసగా రెండు టైటిళ్లు అందించిన మార్‌క్రమ్‌ను ఐపిఎల్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. ఇక జట్టు కూర్పు పరంగా ట్రావిస్‌ హెడ్‌ బ్యాకప్‌గా ఉపయోగించుకున్నా… మార్‌క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, వానిందు హసరంగలను తుది జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది. హసరంగ అవసరం లేదని భావిస్తే కొన్ని మ్యాచ్‌ల్లో అతనికి బదులుగా ఫజల్‌హాక్‌ ఫారూకీ లేదా మార్కో జాన్సెన్‌ను ఆడించే ఛాన్స్‌ ఉంది. ఏది ఏమైనా విదేశీ ఆటగాళ్లను ఆడించడంలో సన్‌రైజర్స్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చు. ఈ సీజన్‌లో ఆరెంజ్‌ ఆర్మీ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను ఢకొీట్టనుంది. మార్చి 23న ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్‌ జరగనుంది.

జట్టు: కమిన్స్‌(కెప్టెన్‌), అబ్దుల్‌ సమద్‌, అభిషేక్‌ శర్మ, మార్‌క్రమ్‌, జాన్సెన్‌, త్రిపాఠి, సుందర్‌, ఫిలిప్స్‌, సన్వీర్‌ సింగ్‌, క్లాసెన్‌, భువనేశ్వర్‌, మయాంక్‌, నటరాజన్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, మయాంక్‌ మార్కండే, ఉపేంద్ర, ఉపేంద్ర సింగ్‌ యాదవ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి, ఫరూకీ, షాబాజ్‌ అహ్మద్‌, హెడ్‌, హసరంగా, ఉనాద్కట్‌, ఆకాష్‌ సింగ్‌, సుబ్రమణ్యన్‌.

➡️