మూడోసారి రంజీ ఫైనల్‌కు విదర్భ

Mar 6,2024 12:13 #match, #ranji, #Sports
  •  మార్చి 10న ముంబై-విదర్భ ఫైనల్ మ్యాచ్

నాగ్‌పూర్‌: రంజీ ట్రోఫీలో విదర్భ మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆఖరి రోజు వరకు రసవత్తరంగా సాగిన సెమీస్‌లో మధ్యప్రదేశ్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. నాగ్‌పూర్‌ వేదికగా మధ్యప్రదేశ్‌- విదర్భ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విదర్భ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 170 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 252 పరుగులకు అలౌట్ అయ్యి విదర్భపై 82 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో యశ్‌ రాథోడ్‌ (141), కెప్టెన్‌, వికెట​ కీపర్‌ బ్యాటర్‌ అక్షయ్‌ వాడ్కర్‌ (77) పరుగులు చేయడంతో 321 పరుగుల లక్ష్యంగా ఉంచారు. ఈ క్రమంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ఈ క్రమంలో బుధవారం నాటి ఐదో రోజు ఆటను 228/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో మొదలుపెట్టిన మధ్యప్రదేశ్‌.. ఆరంభంలోనే కుమార్‌ కార్తికేయ(4), అనుభవ్‌ అగర్వాల్‌(6) వికెట్లు కోల్పోయింది. సారాంశ్‌ జైన్‌ ఆవేశ్‌ ఖాన్‌ (25), ఖెజ్రోలియా(11) త్వరగా పెవిలియన్ కు చేరడంతో మధ్యప్రదేశ్‌ ఓటమి పాలైంది. అంతకుముందు మరో సెమీస్‌ మ్యాచ్‌లో ముంబై తమిళనాడుపై గెలిచి రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లో ప్రవేశించింది. ఇక విదర్భ ఫైనల్‌ చేరడం ఇది మూడోసారి. మార్చి 10న ముంబై, విదర్భ టైటిల్‌ కోసం తలపడనున్నాయి.

➡️