రెండోరోజు వర్షార్పణం

Dec 7,2023 22:23 #Sports

బంగ్లాదేశ్‌-న్యూజిలాండ్‌ రెండోటెస్ట్‌

మీర్‌పుర్‌: బంగ్లాదేశ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండోటెస్ట్‌ రెండోరోజు ఆట వర్షం కారణంగా రద్దయ్యింది. మిర్పూర్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ చినుకులు పడడంతో రెండు జట్ల కెప్టెన్లతో మాట్లాడిన రిఫరీలు మ్యాచ్‌ను రద్దు చేశారు. దాంతో, 55 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ కివీస్‌ ఊపిరిపీల్చుకుంది. రేపు యథావిధిగా ఉదయం న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించనుంది. తొలి టెస్టులో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నజ్ముల్‌ హుసేన్‌ శాంటో బ్యాటింగ్‌ తీసుకున్నాడు. అయితే.. కివీస్‌ స్పిన్నర్లు సాంట్నర్‌, ఫిలిఫ్స్‌ మూడేసి వికెట్లతో బంగ్లాను దెబ్బకొట్టారు. సీనియర్‌ ఆటగాడు ముష్ఫికర్‌ రహీం(35), షబదాత్‌ హొసేన్‌(31) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించడంతో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు పరిమితమైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్‌ తొలిరోజు ఆట ముగిసే సమయానికి క్రీజ్‌లో డారిల్‌ మిచెల్‌(12 నాటౌట్‌), గ్లెన్‌ ఫిలిఫ్స్‌(5 నాటౌట్‌) ఉన్నారు. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 117 పరుగులు వెనకబడి ఉంది. లాథమ్‌కు వన్డే కెప్టెన్సీ న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగే మూడో వన్డేల సిరీస్‌కు టామ్‌ లాథమ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈమేరకు న్యూజిలాండ్‌ క్రికెట్‌బోర్డు(ఎన్‌జడ్‌సి) గురువారం ఓ ప్రకటనలో.. సీనియర్‌ కేన్‌ విలియమ్సన్‌, టిమ్‌ సౌథీకి విశ్రాంతినిస్తున్నట్లు.. లాథమ్‌కు వన్డే కెప్టెన్‌గా ఎంపికచేసినట్లు గురువారం ప్రకటించింది. డిసెంబర్‌ 17న డునెడిన్‌లో తొలి వన్డే జరగనుంది. జట్టు: లాథమ్‌(కెప్టెన్‌), అశోక్‌, అలెన్‌, బ్లండెల్‌, ఛాప్మన్‌, క్లార్క్‌సన్‌, డుఫీ, జెమీసన్‌, మిల్నే, నికోల్స్‌, రూర్కే, రచిన్‌ రవీంద్ర, ఇష్‌ సోథీ, విల్‌ యంగ్‌.

➡️