రోహిత్‌, జడేజా సెంచరీలు..

Feb 15,2024 22:15 #Sports

టెస్టుల్లో సర్ఫరాజ్‌ అరంగేట్రం

భారత్‌ 326/5

రాజ్‌కోట్‌: రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు భారత బ్యాటర్లు రాణించారు. తొలి సెషన్‌లో స్వల్ప వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయినా టీమిండియా సారథి రోహిత్‌ శర్మ (131; 196 బంతుల్లో 14ఫోర్లు, 3సిక్సర్లు), రవీంద్ర జడేజా (110బ్యాటింగ్‌; 212 బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు)తో పాటు అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ (62; 66 బంతుల్లో 9ఫోర్లు, సిక్సర్‌) రాణించారు. దీంతో భారతజట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. జడేజాతో పాటు కుల్‌దీప్‌ యాదవ్‌ (1 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. ఆదిలోనే యశస్వి జైస్వాల్‌ (10) వికెట్‌ కోల్పోయింది. మార్క్‌ వుడ్‌ భారత్‌ను తొలిదెబ్బ తీశాడు. నాలుగో ఓవర్లో తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌కు వుడ్‌ మరో షాకిచ్చాడు. 9 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయని శుభ్‌మన్‌ గిల్‌నూ పెవిలియన్‌కు పంపాడు. నాలుగో స్థానంలో వచ్చిన రజత్‌ పాటిదార్‌(5)ను హర్ట్లీ ఔట్‌ చేశాడు. దీంతో భారత్‌.. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆదుకున్న జడేజాారోహిత్‌కష్టాల్లో ఉన్న భారత్‌ను కెప్టెన్‌ రోహిత్‌-జడేజా ఆదుకున్నారు. ఒక్కో పరుగు చేస్తూ స్కోర్‌బోర్డును మూడంకెలకు చేరువ చేశారు. రెండో సెషనల్‌లో వీరిద్దరూ నిలకడగా ఆడి స్కోరు వేగాన్ని పెంచారు. ఆ సెషన్‌లో భారత్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా ఆడింది. మూడో సెషన్‌ ఆరంభంలోనే రోహిత్‌ శతకం పూర్తిచేశాడు. టెస్టులలో రోహిత్‌కు ఇది 11వ శతకం. సెంచరీ తర్వాత సిక్సర్‌, రెండు ఫోర్లతో వేగంగా ఆడబోయిన రోహిత్‌ను మార్క్‌వుడ్‌ ఔట్‌ చేయడంతో 204 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. వీరిద్దరూ కలిసి 4వ వికెట్‌కు (204పరుగులు) డబుల్‌ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టెస్టుల్లో సర్ఫరాజ్‌ అరంగేట్రం…రోహిత్‌ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. అంచనాలకు మించి రాణించాడు. కేవలం 48 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్‌.. ఈ క్రమంలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ చేసిన భారత క్రికెటర్లలో సర్ఫరాజ్‌ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో యువరాజ్‌ ఆఫ్‌ పాటియాలా, హార్ధిక్‌ పాండ్యాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 1934లో ఇదే ఇంగ్లండ్‌తో ఆడిన మ్యాచ్‌లో యువరాజ్‌ ఆఫ్‌ పాటియాలా.. 42 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. 2017లో శ్రీలంకతో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన హార్దిక్‌.. 48 బంతుల్లో అర్థ శతకం బాదాడు. జడేజా 84 పరుగుల వద్ద ఉండగా క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్‌.. రెండంకెల స్కోరు చేరగానే తొలి బౌండరీ బాదాడు. తర్వాత వరుస ఓవర్లలో బంతిని బౌండరీకి తరలిస్తూ.. టామ్‌ హర్ట్లీ వేసిన 76వ ఓవర్లో ఐదో బంతికి కొట్టిన సిక్సర్‌ అతడి ఇన్నింగ్స్‌కే హైలైట్‌. ఆ తర్వాత బంతికే సింగిల్‌ తీసి అతడు అర్థ సెంచరీ పూర్తిచేశాడు. దూకుడుగా ఆడుతున్న సర్ఫరాజ్‌.. జడేజా 99 పరుగుల వద్ద ఉండగా సమన్వయ లోపంతో రనౌట్‌ అవడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది.

స్కోర్‌బోర్డు…

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)రూట్‌ (బి)వుడ్‌ 10, రోహిత్‌ (సి)స్టోక్స్‌ (బి)వుడ్‌ 131, శుభ్‌మన్‌ (సి)ఫోక్స్‌ (బి)వుడ్‌ 0, రజత్‌ పటీధర్‌ (సి)డకెట్‌ (బి)హార్ట్లీ 5, జడేజా (బ్యాటింగ్‌) 110, సర్ఫరాజ్‌ ఖాన్‌ (రనౌట్‌)వుడ్‌ 62, కుల్దీప్‌ (బ్యాటింగ్‌) 1, అదనం 7. (86ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 326పరుగులు.

వికెట్ల పతనం: 1/22, 2/24, 3/33, 4/237, 5/314

బౌలింగ్‌: ఆండర్సన్‌ 19-5-51-0, వుడ్‌ 17-2-69-3, హార్ట్లీ 23-3-81-1, రూట్‌ 13-1-68-0, రెహాన్‌ అహ్మద్‌ 14-0-53-0

➡️