సెమీస్‌కు అస్మిత

Feb 2,2024 22:11 #Sports

క్వార్టర్స్‌లో ఓడిన మిధున్‌, ట్రీసా-గాయత్రి జంట

థాయ్ లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

బ్యాంకాక్‌: థాయ్ లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో అస్మిత ఛాలిహా మినహా మిగతా షట్లర్లందరూ క్వార్టర్‌ఫైనల్లో పరాజయాన్ని చవిచూశారు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో అస్మిత ఛాలిహా 21-14, 19-21, 21-13తో వార్డోయో(ఇండోనేషియా)పై చెమటోడ్చి నెగ్గింది. తొలి గేమ్‌ను సునాయాసంగా నెగ్గిన అస్మిత.. రెండోగేమ్‌లో పోరాడి ఓడింది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో చెలరేగి ఆడి ఆ గేమ్‌ను కైవసం చేసుకొని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌ సుమారు 57నిమిషాలసేపు సాగింది. ఇక పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన ఏకైక షట్లర్‌ మిధున్‌ మంజునాథ్‌ పరాజయం పాలయ్యాడు. క్వార్టర్స్‌లో మిథున్‌ 19-21, 15-21తో మార్క్‌ కల్జోవో(నెదర్లాండ్స్‌) చేతిలో ఓడాడు. ఈ మ్యాచ్‌ కేవలం 43 నిమిషాల్లోనే ముగిసింది. ఇక మహిళల డబుల్స్‌ సంచలనం ట్రీసా జోలీ-గాయత్రి గోపీచంద్‌ జంట మూడుసెట్ల హోరాహోరీ పోరులో ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో ట్రీసా-గాయత్రి 12-21, 21-17, 21-23తో ఇండోనేషియాకు చెందిన 4వ ర్యాంకర్‌ కుసుమ-ప్రథివి చేతిలో ఓటమిపాలయ్యారు.

➡️