AIFF : ఫుట్‌బాల్‌ మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపులకు పాల్పడిన దీపక్‌ శర్మ

పనాజీ : హిమాచల్‌ ప్రదేశ్‌ ఖాద్‌ ఫుట్‌బల్‌ క్లబ్‌కి చెందిన ఇద్దరు ఫుట్‌బాల్‌ మహిళా క్రీడాకారిణులు ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (ఎఐఎఫ్‌ఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు దీపక్‌శర్మపై తీవ్ర ఆరోపణలు చేశారు. గోవాలో ఇండియన్‌ ఉమెన్స్‌ లీగ్‌ 2 జరుగుతుంది. ఈ సందర్బంగా హోటల్‌ గదిలో ఉన్న తమపై గురువారం రాత్రి దీపక్‌శర్మ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, భౌతికంగా దాడి చేశాడని ఆ క్రీడాకారిణులు ఎఐఎఫ్‌ఎఫ్‌కి శుక్రవారం ఫిర్యాదు చేశారు.
కాగా, ఫిర్యాదు చేసిన ఇద్దరు మహిళా క్రీడాకారిణులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి గోవాకు వెళ్తుండగా మా ముందే అతను మద్యం సేవించాడు.’ అని చెప్పారు. ఇక బాధిత మహిళా క్రీడాకారిణుల్లో ఒకరైన పాలక్‌ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘గురువారం రాత్రి 10.30-11 గంటల సమయంలో నేను గుడ్లు తెచ్చి నా రూమ్‌లో ఉన్న మరో అమ్మాయితో కలిసి ఫుడ్‌ ప్రిపేర్‌ చేస్తున్నాను. ఆ సమయంలో దీపక్‌ సార్‌ నన్ను తన రూమ్‌లోకి రమ్మని పిలిచారు. అప్పుడు నా బదులు నా రూమ్మేట్‌ సార్‌ గదికి వెళ్లి నేను ఫుడ్‌ ప్రిపేర్‌ చేస్తున్నాని చెప్పింది. అప్పుడు సార్‌ ఆ అమ్మాయిని తిట్టి నన్ను రమ్మని పిలిచాడు. వెంటనే సార్‌ గదికి నేను వెళితే నన్ను దుర్భాలాషలాడాడు. నువ్వెందుకు ఫుడ్‌ ప్రిపేర్‌ చేస్తున్నావ్‌? గుడ్లు విసిరేరు అని గట్టిగా చెప్పాడు. దీంతో నేను ఏడవడం మొదలుపెట్టాను. వెంటనే నా గదిలోకి వచ్చాను. సార్‌ మళ్లీ నా రూమ్‌లోకి పరుగెత్తుకుంటూ వచ్చి నాపై శారీరకంగా దాడి చేశాడు. దీంతో నాతో ఉన్న నా రూమ్మేట్‌ బలవంతంగా అతన్ని ఆపింది. దీంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో క్లబ్‌ మేనేజర్‌ భార్య నందిత మా వద్దకు వచ్చింది. ఆమె మాపై మరింత ఒత్తిడి తెచ్చింది. మాకు సంస్కారం లేదని తిట్టింది. ఈ ఫటనతో భయపడి మేము జిఎఫ్‌ఎ (గోవా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌)కి, ఎఐఎఫ్‌ఎఫ్‌కి ఫిర్యాదు చేశాము. అయితే ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకోమని మాపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఘటన తర్వాత మాకు నిద్రపట్టలేదు. దీంతో మేము సరిగ్గా ఆడలేకపోయాము.’ అని అన్నారు.
ఇక ఈ ఘటనకు సంబంధించి జిఎఫ్‌ఎ వైస్‌ ప్రెసిడెంట్‌ జోనాథన్‌ డిసౌసా మాట్లాడుతూ.. ‘మాకు ఫిర్యాదు అందిన తర్వాత మేము మహిళల భద్రత దృష్ట్యా వెంటనే పోలీసులకు ఫార్వార్డ్‌ చేశాము.’ అని అన్నారు. అలాగే ఎఐఎఫ్‌ఎఫ్‌ కమిటీ హెడ్‌ మిస్‌ వాలెంకా అలెమావో బాధిత క్రీడాకారిణీలను కలిశారు. అమ్మాయిలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
లైంగిక వేధింపులకు పాల్పడిన దీపక్‌ శర్మను గోవా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు మేరకు మపుసా పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు పిలిచారు. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు ఎఐఎఫ్‌ఎఫ్‌ స్పందించలేదు. ప్రస్తుతం దీపక్‌శర్మ హిమాచల్‌ ప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ, ఎఐఎఫ్‌ఎఫ్‌ కాంపిటేషన్స్‌ కమిటీకి డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

➡️