100 Test: వందో టెస్టు ఆడుతున్న అశ్విన్‌, బెయిర్‌స్టో

Mar 7,2024 10:59 #Cricket, #Sports, #test match

టీమిండియా బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కెరియర్‌లో వందో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నాడు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఇంగ్లండ్‌తో నేడు ప్రారంభమైన చివరిదైన ఐదో టెస్టులో బరిలోకి దిగిన అశ్విన్‌ శతక టెస్టు ఆడుతున్న 14వ ఇండియన్‌.. 99 టెస్టుల్లో 507 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌ 116 వన్డేల్లో 156 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్‌తోపాటు ఇంగ్లండ్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టోకు కూడా నేటి మ్యాచ్‌ వందోటెస్టే. ఈ ఘతన అందుకున్న 17వ ఇంగ్లిష్‌ క్రికెటర్‌గా బెయిర్‌స్టో రికార్డు అందుకున్నాడు. నేటి ధర్మశాల టెస్టుకు ముందు బెయిర్‌స్టో 5,974 పరుగులు చేశాడు.

దిగ్గజాల సరసన అశ్విన్‌

నేటి టెస్టుతో అశ్విన్‌ భారత క్రికెట్‌ దిగ్గజాలైన సచిన్‌ టెండూల్కర్‌ (200), రాహుల్‌ ద్రవిడ్‌ (163), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (134), అనిల్‌ కుంబ్లే (132), కపిల్‌ దేవ్‌ (131), సునీల్‌ గవాస్కర్‌ (125), దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ (116), సౌరవ్‌ గంగూలీ (113), విరాట్‌ కోహ్లీ (113), ఇషాంత్‌ శర్మ (105), హర్భజన్‌ సింగ్‌ (103), పుజారా (103) సరసన చేరాడు.

➡️