సంజయ్ ని తప్పించండి! 

Dec 12,2023 11:47 #Dharna, #Sports, #Wrestlers
  •  క్రీడాశాఖ మంత్రికి రెజ్లర్ల వినతి

న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్ష రేసు నుంచి బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అనుచరుడు సంజయ్ సింగ్‌ను తప్పించాలని అగ్రశేణి రెజ్లర్లు, ఒలింపిక్‌ పతక విజేతలు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పూనియాలు సోమవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను కోరారు. భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా 12 ఏండ్లలో బ్రిజ్‌భూషణ్‌ ఎన్నో ఆగడాలకు పాల్పడ్డాడని, మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని రెజ్లింగ్‌ క్రీడాకారులు జంతర్‌మంతర్‌ వద్ద రెండు దఫాలుగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. రెజ్లర్ల నిరసనను విరమింపజేసేందుకు.. బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎవరూ రానున్న ఎన్నికల్లో పోటీ చేయరనే హామీ క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఇచ్చారు. కానీ డిసెంబర్‌ 21న ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో జరుగనున్న ఎన్నికల్లో బ్రిజ్‌ భూషణ్‌ అత్యంత సన్నిహితుడు సంజయ్ సింగ్‌ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. దీంతో రెజ్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిజ్‌భూషణ్‌ పదవిలో లేకపోయినా.. అతడి సన్నిహితుల ద్వారా మళ్లీ సమాఖ్యను నడిపిస్తాడని, మల్లయోధుల ఆందోళనకు అర్థమే లేకుండా పోతుందని ఈ సందర్భంగా క్రీడాశాఖ మంత్రితో బజరంగ్‌, సాక్షి తెలిపారు. సోమవారం క్రీడామంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను స్టార్‌ రెజ్లర్లు కలిశారు.

అతడు తప్పుకోకుంటే… : ‘క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ను కలిశాం. గతంలో ఇచ్చిన హామీ గుర్తు చేశాం. బ్రిజ్‌భూషణ్‌ అనుచరులు ఎవరూ ఎన్నికల్లో నిలబడకుండా చూస్తామని మాట ఇచ్చారు. సంజయ్ సింగ్‌… బ్రిజ్‌భూషణ్‌కు అత్యంత సన్నిహితుడు. అతడు అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకోవాలి. లేదంటే, రెజ్లర్ల భవిష్యత్‌ కార్యాచరణపై పునరాలోచన చేస్తాం. అదే విషయాన్ని క్రీడాశాఖ మంత్రికి తెలిపాం. అధ్యక్ష అభ్యర్థిగా నిలిచిన అనిత షియోరాన్‌పై మాకు అభ్యంతరాలు లేవు. ఆమె మాజీ మల్లయోధురాలు. రెజ్లర్లు దేశానికి మెడల్‌ తెచ్చేందుకు ఎంత కష్టపడతారనే సంగతి ఆమెకు తెలుసు. మాజీ రెజ్లర్లు ఫెడరేషన్‌లో ఆఫీస్‌ బేరర్లుగా ఉండాలని కోరుకుంటున్నాం. అనిత కామన్‌వెల్త్‌ గేమ్స్‌ మెడలిస్ట్‌.. రెజ్లర్ల డిమాండ్లను అర్థం చేసుకుంటుంది’ అని సాక్షి, బజరంగ్‌ తెలిపారు. డిసెంబర్‌ 21న జరిగే ఎన్నికల్లో రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్‌ ఎన్నిక లాంఛనమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఓటర్లలో 90 శాతం మంది మద్దతు బ్రిజ్‌భూషణ్‌ కూడగట్టినట్టు సమాచారం. దీంతో మాజీ రెజ్లర్‌ అనిత నిలిచినా.. ఆమెకు పెద్దగా అవకాశాలు లేనట్టే. 12 ఏండ్ల అధ్యక్షుడిగా కొనసాగిన బ్రిజ్‌భూషణ్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ కోడ్‌ ప్రకారం ఈసారి రేసులో నిలువలేదు. అతడి కుమారుడు కరణ్‌ సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌ రెజ్లింగ్‌ సంఘం ఉపాధ్యక్షుడు), అల్లుడు విశాల్‌ సింగ్‌ (బిహార్‌ రెజ్లింగ్‌ సంఘం అధ్యక్షుడు)లు సైతం ఎన్నికలకు దూరంగానే ఉన్నారు.

➡️