ప్లే-ఆఫ్‌కు బెంగళూరు

May 19,2024 08:31 #2024 ipl, #rcb, #Sports
  •  ఉత్కంఠ పోరులో చెన్నైపై 27పరుగుల తేడాతో గెలుపు
  •  డుప్లెసిస్‌ అర్ధసెంచరీ
  •  రాణించిన కోహ్లి, పటీధర్‌

బెంగళూరు: ప్లే-ఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) అద్భుతం చేసింది. 219పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నైకు నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై జట్టు చివరి బంతి వరకు పోరాడి 27పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 201పరుగులు చేస్తే ప్లే-బెర్త్‌ చెన్నైకు దక్కే ఛాన్స్‌ ఉండగా.. చివరి ఓవర్లో బెంగళూరు బౌలర్‌ యశ్‌ దయాల్‌ సూపర్‌ బౌలింగ్‌ చేసి అద్భుతం చేశాడు. చివరి 6బంతుల్లో 17పరుగులు చేస్తే చెన్నై ప్లే-ఆఫ్స్‌కు చేరుతుంది. క్రీజ్‌లో ధోనీ, జడేజా ఉన్నారు. ఆ దశలో తొలి బంతిని ధోనీ భారీ సిక్సర్‌ కొట్టాడు. దీంతో 5బంతుల్లో 11 పరుగులు చేస్తే చెన్నైకు ప్లే-బెర్త్‌ ఛాన్స్‌ దక్కుతుందనగా యశ్‌ దయాల్‌ మ్యాజిక్‌ బౌలింగ్‌ చేశాడు. ఆ తర్వాత బంతికి ధోనీని ఔట్‌ చేశాడు. ఆ తర్వాత శార్దూల్‌ రెండు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసినా.. చివరి 2 బంతుల్లో 10 పరుగులు చేస్తే చెన్నైకు ప్లే-ఆఫ్‌ ఛాన్స్‌ దక్కుతుంది. ఆ దశలో యశ్‌ దయాల్‌ ఆ తర్వాత రెండు బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా బెంగళూరు గెలిపించాడు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 7వికెట్లు కోల్పోయి 191పరుగులే చేసింది. దీంతో బెంగళూరు జట్టు చాలాకాలం తర్వాత ప్లే-ఆఫ్‌కు చేరింది. దీంతో బెంగళూరు జట్టు 14పాయింట్ల తో 4వ స్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరింది.
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, డుప్లెసిస్‌, పాటిదార్‌, కామెరాన్‌ గ్రీన్‌.. ఇలా టాపార్డర్‌లో అందరూ రాణించారు. కోహ్లీ, డుప్లెసిస్‌ జోడీ తొలి వికెట్‌ కు 78 పరుగులు జోడించి శుభారంభం అందించారు. కోహ్లీ 29బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లతో 47పరుగులు చేయగా… కెప్టెన్‌ డుప్లెసిస్‌ 39బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. రజత్‌ పటీదార్‌ చిచ్చరపిడుగులా 23బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. చివర్లో కామెరాన్‌ గ్రీన్‌ ఈ మ్యాచ్‌ లో భారీ షాట్లతో అలరించాడు. గ్రీన్‌ 17 బంతుల్లోనే 3ఫోర్లు, 3సిక్సర్లతో 38పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దినేశ్‌ కార్తీక్‌ 6 బంతుల్లో 14, మ్యాక్స్‌వెల్‌ 5 బంతుల్లో 16 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌కు రెండు, తుషార్‌ దేశ్‌ పాండే, మిచెల్‌ సాంట్నర్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నైను 200పరుగులలోపు కట్టడి చేస్తే బెంగళూరు జట్టు ప్లే-ఆఫ్‌కు చేరడం ఖాయం.

➡️