GT vs DC: పేస్‌కు గుజరాత్‌ దాసోహం

  • ఆరు వికెట్ల తేడాతో నెగ్గిన ఢిల్లీ
  • సీజన్‌-17 ఐపిఎల్‌లో అత్యల్ప స్కోర్‌ నమోదు

అహ్మదాబాద్‌: ఢిల్లీ పేసర్ల ధాటికి గుజరాత్‌ జెయింట్‌ జట్టు దాసోహమైంది. ముఖేష్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ, స్టబ్స్‌ ధాటికి గుజరాత్‌ జట్టు కేవలం 89పరుగులకే కుప్పకూలింది. ఆ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ 8.5ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించి ఈ సీజన్‌లో మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. రషీద్‌ ఖాన్‌ (31) మాత్రమే జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. కానీ అప్పటికే జట్టు మొత్తం విఫలం కావడంతో 89 పరుగుల వద్దనే గుజరాత్‌ ఆగిపోయింది. దీంతో 90 పరుగుల అత్యల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లు మధ్యలో తడబడినప్పటికీ 8.5 ఓవర్లలోనే అవలీలగానే టార్గెట్‌ను చేధించారు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(8) ఔటవ్వగా.. నాలుగో ఓవర్‌లో ఐదో బంతికి మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా(2) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఐదో ఓవర్‌లో మొదటి బంతికి సాయి సుదర్శన్‌(12) రనౌటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డేవిడ్‌ మిల్డర్‌(2) కూడా రిషబ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తొమ్మిదో ఓవర్‌లో అభినవ్‌ మనోహర్‌(8), షారుక్‌ ఖాన్‌(0)ను రిషబ్‌ పంత్‌ స్టంపౌట్‌ చేశాడు. 12వ ఓవర్‌లో రెండో బంతికి రాహుల్‌ తెవాటియా (10) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 15వ ఓవర్‌లో చివరి బంతికి మోహిత్‌ శర్మ (2).. సుమిత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 18వ ఓవర్‌లో మొదటి బంతికే రషీద్‌ ఖాన్‌ (31) పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నూర్‌ అహ్మద్‌, స్పెన్సర్‌ జాన్సన్‌ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఫలితంగా 17.3 ఓవర్ల వద్ద 89 పరుగులకే గుజరాత్‌ ఆలౌట్‌ అయ్యింది. అత్యల్ప టార్గెట్‌ను చేధించేందుకు క్రీజులోకి ముందుగా వచ్చిన జెక్‌ ఫ్రేజర్‌(20) దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. అతనికి పృథ్వీ షా(7) తోడయ్యాడు. కానీ జెక్‌ ఫ్రేజర్‌ దూకుడుకు స్పెన్సర్‌ జాన్సన్‌ చెక్‌ పెట్టాడు. ఫ్రేజర్‌ ఔటయిన కాసేపటికే పథ్వీ షా కూడా పెవిలియన్‌కు పంపించారు. ఆ తర్వాత కాసేపటికే గుజరాత్‌ బౌలర్లు అభిషేక్‌ పొరెల్‌(15), షై హౌప్‌(19) వికెట్లను తీసి ఢిల్లీని టెన్షన్‌ పెట్టాలని అనుకున్నారు. కానీ రిషబ్‌ పంత్‌(16), సుమిత్‌ కుమార్‌(9) నిలకడగా ఆడుతూ టార్గెట్‌ను చేధించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రిషబ్‌ పంత్‌కు లభించింది.

స్కోర్‌బోర్డు…
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: వృద్ధిమాన్‌ సాహా (బి)ముఖేశ్‌ కుమార్‌ 2, శుభ్‌మన్‌ గిల్‌ (సి)పృథ్వీ షా (బి)ఇషాంత్‌ 8, సాయి సుదర్శన్‌ (రనౌట్‌)సుమిత్‌ కుమార్‌ 12, డేవిడ్‌ మిల్లర్‌ (సి)పంత్‌ (బి)ఇషాంత్‌ 2, మనోహర్‌ (స్టంప్‌)పంత్‌ (బి)స్టంబ్స్‌ 8, తెవాటియా (ఎల్‌బి)అక్షర్‌ 10, షారుక్‌ ఖాన్‌ (స్టంప్‌)స్టంబ్స్‌ 0, రషీద్‌ ఖాన్‌ (సి)పంత్‌ (బి)ముఖేశ్‌ కుమార్‌ 31, మోహిత్‌ శర్మ (సి)సుమిత్‌ కుమార్‌ (బి)ఖలీల్‌ అహ్మద్‌ 2, నూర్‌ అహ్మద్‌ (బి)ముఖేష్‌ కుమార్‌ 1, జాన్సన్‌ (నాటౌట్‌) 1, అదనం 12. (17.3ఓవర్లలో ఆలౌట్‌) 89పరుగులు.
వికెట్ల పతనం: 1/11, 2/28, 3/28, 4/30, 5/47, 6/48, 7/66, 8/78, 9/89, 10/89
బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-1-18-1, ఇషాంత్‌ శర్మ 2-0-8-2, ముఖేశ్‌ కుమార్‌ 2.3-0-14-3, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-16-0, స్టంబ్స్‌ 1-0-11-2, అక్షర్‌ పటేల్‌ 4-0-17-1.
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి)జాన్సన్‌ (బి)వారియర్‌ 7, ఫ్రేజర్‌ (సి)మనోహర్‌ (బి)జాన్సన్‌ 20, పోరెల్‌ (బి)వారియర్‌ 15, హోప్‌ (సి)మోహిత్‌ శర్మ (బి)రషీద్‌ ఖాన్‌ 19, పంత్‌ (నాటౌట్‌) 16, సుమిత్‌ కుమార్‌ (నాటౌట్‌) 9, అదనం 6. (8.5ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 92పరుగులు.
వికెట్ల పతనం: 1/25, 2/31, 3/65, 4/67
బౌలింగ్‌: సందీప్‌ వారియర్‌ 3-0-40-2, జాన్సన్‌ 2-0-22-1, రషీద్‌ ఖాన్‌ 2-0-12-1, నూర్‌ అహ్మద్‌ 1.5-0-14-0

➡️