విండీస్‌ చేతిలో ఇంగ్లండ్‌ చిత్తు

Dec 13,2023 11:36 #Cricket, #Sports
  • రీఎంట్రీలో రాణించిన రసెల్‌

వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచి ఇంగ్లిష్‌ జట్టుకు షాకిచ్చిన వెస్టిండీస్‌.. టీ20 సిరీస్‌ను విజయంతో ఆరంభించి సత్తా చాటింది. బార్బడోస్‌ వేదికగా బుధవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 19.3 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌ 20 బంతుల్లో 40, జోస్‌ బట్లర్‌ 31 బంతుల్లో 39 పరుగులతో శుభారంభం అందించగా.. మిగతా వాళ్లలో లియామ్‌ లివింగ్‌ స్టోన్‌(27) పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు విల్ జాక్ 17, బెన్ డకెట్ 14, బ్రూక్ 1, శామ్ కరన్ 13, అహ్మద్ 1, అదిల్ రషీద్ 0, మైల్స్ 0, క్రిస్ వోక్స్ 3 నాటౌట్ గా నిలిచారు. విండ్ బౌలర్లలో ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌, అల్జారీ జోసెఫ్‌ చెరో మూడు వికెట్లు, రొమారియో షెఫర్డ్‌ రెండు వికెట్లు, హోల్డర్‌, అకీల్‌ హొసేన్‌కు తలో ఒక వికెట్‌ దక్కింది. లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌(22), కైలీ మేయర్స్‌(35) మంచి ఆరంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ షాయీ హోప్‌ 36 పరుగులతో రాణించాడు. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన నికోలస్‌ పూరన్‌ 13, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ ఒక్క పరుగుకే చేసిన చివరిలో కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌, ఆండ్రీ రసెల్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ చెలరేగారు. పావెల్‌ 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు, రసెల్‌ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 14 బంతుల్లో 29 పరుగులు చేసి జట్టును గెలిపించారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ఇరు జట్ల మధ్య గురువారం రెండో టీ20 జరుగనుంది.

➡️