French Open: నాదల్‌, నాగల్‌ ఔట్‌..

May 27,2024 22:20 #French Open, #Sports, #Tennis
  • రెండోరౌండ్‌కు జ్వెరేవ్‌, సిన్నర్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ 14సార్లు టైటిల్‌ విజేత రఫెల్‌ నాదల్‌తోపాటు భారత సంచలనం సుమిత్‌ నాగల్‌ తొలిరౌండ్‌లోనే ఓటమిపాలయ్యారు. గాయం కారణంగా రెండేళ్ల తర్వాత మళ్లీ రాకెట్‌ పట్టిన నాదల్‌ 3-6, 6-7(5-7), 3-6తో 4వ సీడ్‌ జ్వెరేవ్‌(జర్మనీ) చేతిలో ఓటమిపాలయ్యాడు. ఇక భారత సంచలనం సుమిత్‌ నాగల్‌ 18వ సీడ్‌ ఖచనోవ్‌(రష్యా) చేతిలో వరుససెట్లలో ఓడాడు. ఈ మ్యాచ్‌లో నాగల్‌ 2-6, 0-6, 6-7(5-7)తో ఖచనోవ్‌ చేతిలో ఓడాడు. ముఖ్యంగా మూడో సెట్‌లో నాగల్‌ అద్భుతంగా పుంజుకొని సీడెడ్‌ క్రీడాకారుణికి ముచ్చెమటలు పట్టించాడు. ఇక ఇటలీకి చెందిన జెన్నిక్‌ సిన్నర్‌ రెండోరౌండ్‌లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో సిన్నర్‌ 6-3, 6-3, 6-4తో క్రిస్టోఫర్‌ ఎబోంక్స్‌(అమెరికా)ను చిత్తుచేశాడు. గాయం నుంచి కోలుకొని గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఎంట్రీ ఇచ్చిన సిన్నర్‌ పూర్వ ప్రదర్శనను కనబరిచాడు. ఇందులో 32 విన్నింగ్‌ షాట్స్‌ ఉన్నాయి. అలాగే రోలాండ్‌ గారోస్‌లో రికార్డును 29-2కు పెంచుకున్నాడు. మరోపోటీలో 2016రన్నరప్‌ ఆండీ ముర్రే తొలిరౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. తొలిరౌండ్‌లో ముర్రే 4-6, 4-6, 2-6తో మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత స్టాన్‌ వావ్రింకా చేతిలో ఓడాడు. మరో పోటీలో 9వ సీడ్‌ సిట్సిపాస్‌(గ్రీక్‌) 7-6(9-7), 6-4, 6-1తో ఫుస్కోవిక్‌(హంగేరీ), అగర్‌-అలిసిమి(కెనడా) 6-2, 6-4, 6-4తో నిషికోరి(జపాన్‌)ను ఓడించి రెండోరౌండ్‌కు చేరారు.

స్వైటెక్‌, వోండ్రుసోవా ముందుకు..
మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ ఇగా స్వైటెక్‌(పోలండ్‌), 5వ సీడ్‌ వోండ్రుసోవా(చెక్‌ రిపబ్లిక్‌) శుభారంభం చేశారు. సోమవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో స్వైటెక్‌ 6-1, 6-2తో జేంజియన్‌(ఫ్రాన్స్‌), వోండ్రుసోవా 6-1, 6-3తో మసరోవా(స్పెయిన్‌)లను సునాయాసంగా ఓడించారు. మరోపోటీలో 8వ సీడ్‌ జబీర్‌ 6-3, 6-2తో విక్కెర్రీ(అమెరికా), 12వ సీడ్‌ పొలిని(ఇటలీ) 6-3, 6-4తో సబిలి(ఆస్ట్రేలియా)ను ఓడించారు.

➡️