మారుమూల గ్రామాల్లో వైద్య సేవ

Jul 1,2024 04:05 #Jeevana Stories

జీవితంలో ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం బాగా లేకపోతే అన్నీ వృథానే! అయితే, సమాజం ఇంతగా అభివృద్ధి చెందినా చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా వైద్యసేవలు పొందలేని సామాన్యులు ఎందరో ఉన్నారు. ప్రభుత్వరంగంలో వైద్య సదుపాయాలు అభివృద్ధి కావాల్సినంత స్థాయిలో లేవు. కార్పొరేటు హాస్పటళ్లు వచ్చాక మామూలు ప్రజలకు వైద్యం అందనంతదూరంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన డాక్టర్‌ కారెం రవితేజ, డాక్టర్‌ శ్రావణి దంపతులు తమకు వీలైనంత మేర పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. జులై 1 వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్‌ రవితేజ మాటల్లో వారి సేవల గురించి తెలుసుకుందాం.
”ఆధునిక టెక్నాలజీ వైద్య రంగం స్వరూపాన్నే సమూలంగా మార్చేసింది. శరీరంలోని ప్రతి అవయవాన్నీ, ప్రతి భాగాన్ని శోధించి రోగానికి కారణాలేమేమిటో ఖచ్చితంగా కనిపెట్టగలిగే యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల వైద్యుని పాత్ర కూడా వేగంగా మారిపోయింది. స్పెషలైజేషన్స్‌ బాగా పెరిగిపోయాయి. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు పెరుగుతున్నాయి. ఆస్పత్రిలో చేరిన రోగి ఆరోగ్యంగా తిరిగి వెళ్లే పరిస్థితులు మెరుగుపడ్డాయి. మరోవైపు కుటుంబ వైద్యులు కనుమరుగవుతున్నారు. రోగికీ, వైద్యునికీ మధ్య అంతరం పెరుగుతోంది. అలాగే వైద్యంలో ఆధునీకరణ ఫలితాలు, నూతన ఆవిష్కరణలు వస్తున్నా ఇంకా సామాన్యులకు పూర్తిస్థాయిలో అందడంలేదు. అందుకే మా వంతుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రభుత్వాసుపత్రిలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా నా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూనే.. సామాన్య పేద ప్రజలకు మారుమూల ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలను అందిస్తున్నాను. నాతోపాటుగా నా సతీమణి డాక్టర్‌ శ్రావణి కూడా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. మేమిద్దరం గ్రామాల్లో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం.
పట్టణాలు, నగరాల్లో వైద్యసేవలు అందుబాటులో ఉన్న నేటి రోజుల్లో మారుమూల గ్రామాల్లోనూ, నదీ, సముద్ర తీర ప్రాంతాల్లోనూ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో లేవు. ఈ విషయాన్ని గుర్తించిన మేము గత ఐదేళ్లుగా ఆ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించటంతోపాటు మందులు కూడా ఇస్తున్నాం. వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత వ్యాధికి అవసరమైన గైడెన్స్‌తోపాటుగా చికిత్సలు కూడా అందేలా కృషి చేస్తున్నాం. కోనసీమ ప్రాంతంలోని మత్స్యకార గ్రామాల్లో వైద్య సేవలు అంతగా అందుబాటులో లేవు. మేము ప్రతి ఆదివారం ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం.

పేదలు నివసించే ప్రాంతాల్లో …
నా సతీమణి డాక్టర్‌ శ్రావణి ఆధ్వర్యంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు నివసించే మారుమూల గ్రామాల్లో ప్రతి ఆదివారం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ వ్యాధులపై అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయటంతోపాటుగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. షుగర్‌, గుండె, కిడ్నీ, ఫిట్స్‌, నరాల బలహీనత, ఆస్తమా, డెంగ్యూ, ఆయాసం, దగ్గు, థైరాయిడ్‌, మలేరియా, టైఫాయిడ్‌, అతిసార, విష జ్వరాలు తదితర రోగాలకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. అవసరమైన వారికి గుండె, ఇసిజి, బ్లడ్‌ టెస్టులు వంటివి చేస్తున్నాం.

దత్తత గ్రామంలో సేవలు
అమలాపురం మండలంలోని సీతారామపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. ఇక్కడి గ్రామ ప్రజలకు మా వంతుగా వైద్య సేవలు అందించటంతోపాటు పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, పర్యావరణం, వివిధ వ్యాధులుాజాగ్రత్తలు, ఎయిడ్స్‌, క్షయ తదితర వ్యాధులపై అనేక రూపాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గ్రామ అభివృద్ధి అంశాలపై కూడా అక్కడి గ్రామస్తులు, పెద్దలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి మెరుగుదలకు ప్రయత్నిస్తున్నాం. ప్రజలకు మౌలిక వసతుల కల్పన, ప్రజారోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిరంతరం గైడెన్స్‌ ఇస్తున్నాం. ఇంకా రంగాపురం, కిత్తన చెరువు, అయినవిల్లిలంక, ముక్తేశ్వరం, గోపవరం, ఉప్పలగుప్తం, గచ్చకాయల పొర, కాట్రేనికోన, నేదునూరు, ఎన్‌.కొత్తపల్లి, వీరవల్లి పాలెం, జనుపూడి గ్రామాల్లో ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం.
కోవిడ్‌ సమయంలో …
కోవిడ్‌ సమయంలో ఆర్థిక స్థోమత లేని వారి ప్రాణాలను కాపాడేందుకు మా వంతుగా కృషి చేశాం. మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడి రోగులకు వైద్య సేవలు అందించటమే కాక గ్రామస్తులకు అవసరమైన ఆరోగ్య జాగ్రత్తలు తెలియజేశాం. ఆహార పొట్లాలు, మందులు వంటివి కూడా పంపిణీ చేశాం. పేదరికం కారణంగా వైద్యానికి దూరంగా ఉండిపోయేవారిని గుర్తించి, వారికి ఉచితంగా వైద్య సేవలు అందించాం.”
ా ఇంటర్వ్యూ : యడవల్లి శ్రీనివాసరావు

➡️