కుర్రాళ్లు.. కేక.. 

Feb 7,2024 10:06 #Sports
  • ఫైనల్లో భారత యువజట్టు
  • సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై సంచలన విజయం
  • ఐసిసి అండర్‌19 ప్రపంచకప్‌

జహన్నెస్‌బర్గ్‌: ఐసిసి(అండర్‌19) వన్డే ప్రపంచకప్‌లో యువ క్రికెటర్లు కేక పుట్టించారు. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన తొలి సెమీస్‌లో ఓటమి అంచుల్లో నిలిచి టీమిండియా.. విజయతీరాలకు చేరిన తీరు వర్ణణాతీతం. సఫారీ యువ జట్టు నిర్దేశించిన 245పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత యువజట్టు 32పరుగులకే టాప్‌ ఆర్డర్‌ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్‌ ఉదరు సహారన్‌(81) అర్ధసెంచరీకి తోడు.. సచిన్‌ ధాస్‌(96) తృటిలో సెంచరీని చేజార్చుకొన్నారు. వీరిద్దరూ కలిసి 5 వికెట్‌కు ఏకంగా 171పరుగులు జతచేశారు. ఆ తర్వాత వీరి ఔటైనా.. ఆల్‌రౌండర్‌ లింబాని(13నాటౌట్‌; 4బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌) మ్యాచ్‌ను ముగించాడు. దీంతో భారత్‌ 48.5ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 248పరుగులు చేసి విజయం సాధించి వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. విల్లోమోర్‌ పార్క్‌ వేదికగా జరిగిన తొలి సెమీస్‌లో టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా యువ జట్టులో లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (76; 102బంతుల్లో, 6ఫోర్లు, 3సిక్సర్లు), రిచర్డ్‌ సెలెట్స్వేన్‌ (64; 100బంతుల్లో, 4ఫోర్లు, 2సిక్సర్లు) రాణించారు. సఫారీలు ఐదో ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయారు. ఓపెనర్‌ స్టీవ్‌ స్టాక్‌(14)ను రాజ్‌ లింబాని ఔట్‌ చేశాడు. వన్‌ డౌన్‌లో వచ్చిన డేవిడ్‌ టీగర్‌ పరుగులేమీ చేయకుండానే నిష్క్రమించాడు. 46పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన సఫారీలను ప్రిటోరియస్‌ారిచర్డ్‌లు ఆదుకున్నారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 72పరుగులు జోడించారు. భారీషాట్లు ఆడకపోయినా వికెట్లు కాపాడుకుంటూ ఆడుతున్న ఈ జోడీని ముషీర్‌ ఖాన్‌ విడదీశాడు. 30వ ఓవర్లో రెండో బంతికి ప్రిటోరియస్‌.. మురుగన్‌ అభిషేక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రిటోరియస్‌ ఔట్‌ అయినా రిచర్డ్‌.. ఒలీవర్‌ వైట్‌హెడ్‌ (22)తో కలిసి నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. ఒలీవర్‌ను కూడా ముషీర్‌ ఖాన్‌ ఔట్‌ చేశాడు. అర్థ సెంచరీ చేసుకున్నాక రిచర్డ్‌.. నమన్‌ తివారి బౌలింగ్‌లో ప్రియాన్షుకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆఖర్లో కెప్టెన్‌ జువాన్‌ జేమ్స్‌ (24, 19 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌), ట్రిస్టన్‌ లూస్‌ (23నాటౌట్‌, 12 బంతుల్లో ఫోర్‌, 2సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో సఫారీ స్కోరుబోర్డు 244లకు చేరింది. భారత బౌలర్లు లింబానికి మూడు, ముషీర్‌ ఖాన్‌కు రెండు, తివారి, సౌమీ పాండేలకు ఒక్కో వికెట్‌ దక్కాయి. 32పరుగులకు 4వికెట్లనుంచి.. గెలుపు తీరాలకు..లక్ష్యఛేదనలో టీమిండియా 32పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సఫారీ పేసర్‌ ట్రిస్టాన్‌ లూస్‌ భారత బ్యాటర్లను హడలెత్తించాడు. లూస్‌ 3 వికెట్లతో భారత్‌ టాపార్డర్‌ను దెబ్బతీశాడు. ఇన్నింగ్స్‌ మొదటి బంతికే ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌(0) డకౌట్‌ అయ్యాడు. ఈ వికెట్‌ క్వెనా ఎంఫాకా ఖాతాలో చేరింది. అక్కడ్నించి ట్రిస్టాన్‌ లూస్‌ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటింగ్‌ లైనప్‌కు పరీక్ష పెట్టాడు. తొలుత ముషీర్‌ ఖాన్‌(4)ను అవుట్‌ చేసిన లూస్‌… అదే ఊపులో మరో ఓపెనర్‌ అర్షిన్‌ కులకర్ణి(12), ప్రియాన్షు మోలియా(5)లను పెవిలియన్‌ చేర్చాడు. ఆ దశలో కెప్టెన్‌ సహారన్‌(81; 124బంతుల్లో 6ఫోర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడాడు. సచిన్‌ ధాస్‌(96; 95బంతుల్లో 11ఫోర్లు, సిక్సర్‌) ధాటిగా ఆడినా.. కెప్టెన్‌ ఆచి తూడి ఆడాడు. వీరిద్దరూ కలిసి ఆచి తూచి ఆడడంతో భారతజట్టు 203పరుగుల వరకు 5 వికెట్లు కోల్పోలేదు. ఆ తర్వాత వీరు ఔటైనా.. మిగతా పని లింబాని(13; 4బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌) మ్యాచ్‌ ముగించాడు. ప్లేయఱ్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సచిన్‌ దాస్‌కు లభించింది. పాకిస్తాన్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య 8న రెండో సెమీస్‌ జరగనుండగా.. ఫైనల్‌ మ్యాచ్‌ 11న ఆదివారం బెనోని మైదానంలో జరగనుంది.

స్కోర్‌బోర్డు…

దక్షిణాఫ్రికా(అండర్‌19) ఇన్నింగ్స్‌: ప్రెటోరియస్‌ (సి)మురుగన్‌ అభిషేక్‌ (బి)ముషీర్‌ ఖాన్‌ 76, స్టీవ్‌ స్టోక్‌ (సి)అవనీశ్‌ (బి)రాజ్‌ లింబని 14, డేవిడ్‌ టీజర్‌ (బి)రాజ్‌ లింబని 0, రిచర్డ్‌ (సి)ప్రియాన్షు (బి)నమన్‌ తివారి 64, ఓలీవర్‌ (సి)సచిన్‌ దాస్‌ (బి)ముషీర్‌ ఖాన్‌ 22, దేవన్‌ మారిస్‌ (సి)మురగన్‌ అభిషేక్‌ (బి)సౌమీ పాండే 3, జువాన్‌ జేమ్స్‌ (సి)ఆరవిల్లి అవనీశ్‌ (బి)రాజ్‌ లింబని 24, నార్టన్‌ (నాటౌట్‌) 7, త్రిషన్‌ లూస్‌ (నాటౌట్‌) 23, (50ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 244పరుగులు.

వికెట్ల పతనం: 1/23, 2/46, 3/118, 4/163, 5/175, 6/214, 7/220

ఇండియా(అండర్‌19) ఇన్నింగ్స్‌: ఆదర్ష్‌ సింగ్‌ (సి)ప్రెటోరియస్‌ (బి)క్వేనా 0, కులకర్ణి (సి)జేమ్స్‌ (బి)త్రిస్టాన్‌ లూస్‌ 12, ముషీర్‌ ఖాన్‌ (సి)జేమ్స్‌ (బి)లూస్‌ 4, ఉదరు సహరన్‌ (రనౌట్‌) ఓలీవర్‌ (బి)మొకీనా 81, ప్రియాన్షు మోలియా (సి)ప్రిటోరియస్‌ (బి)త్రిస్తాన్‌ లూస్‌ 5, సచిన్‌ ధాస్‌ (సి)డేవిడ్‌ (బి)క్వేనా 96, అవనీశ్‌ (సి)నార్టన్‌ (బి)మఫాకా 10, మురుగన్‌ అభిషేక్‌ (రనౌట్‌) దేవాన్‌ 0, రాజ్‌ లింబాని (నాటౌట్‌) 13, నౌమన్‌ తివారి (నాటౌట్‌) 0, అదనం 27. (48.5ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 248పరుగులు.

వికెట్ల పతనం: 0/1, 2/8, 3/25, 4/32, 5/203, 6/226, 7/227, 8/244

బౌలింగ్‌: క్వేనా 10-0-32-3, త్రీస్టన్‌ లూస్‌ 10-1-37-3, రిలే నోర్టన్‌ 9-0-53-0, నోబని 7.5-0-45-0, స్టీవ్‌ స్టోల్క్‌ 2-9-18-0, జువన్‌ జేమ్స్‌ 8-0-44-0, ఓలీవర్‌ 2-0-17-0

➡️