IPL 2024: ఐపిఎల్‌లో రికార్డు ఛేదన

Apr 27,2024 10:22 #Sports
  • 262పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్‌
  •  కోల్‌కతాపై 8వికెట్ల తేడాతో గెలుపు
  •  బెయిర్‌స్టో సెంచరీ, ప్రభుసిమ్రన్‌, శశాంక్‌ అర్ధసెంచరీలు
  •  నరైన్‌, సాల్ట్‌ విధ్వంసం వృధా

కోల్‌కతా: ఐపిఎల్‌లో పంజాబ్‌ జట్టు రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. కోల్‌కతా జట్టు నిర్దేశించిన 262పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ జట్టు మరో 8బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు 261పరుగులు చేసింది. సాల్ట్‌(75), నరైన్‌(71) తొలి వికెట్‌కు 10 ఓవర్లలో 138పరుగులు జతచేసి గట్టి పునాది వేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ జట్టును ప్రభ్‌ సిమ్రన్‌(54), బెయిర్‌స్టో(108నాటౌట్‌) తొలి వికెట్‌కు 93పరుగులు జతచేశారు. ఆ పరుగులను కేవలం పవర్‌ప్లే(6 ఓవర్లు)లోనే పంజాబ్‌ జట్టు బ్యాటర్లు సాధించారు. ఆ తర్వాత రూసో(26) విఫలమైనా.. శశాంక్‌(68నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించాడు. అంతకుముందు టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌ దిగిన కోల్‌కతాను ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌(75), సునీల్‌ నరైన్‌(71) అర్ధ శతకాలతో చెలరేగి గట్టి పునాది వేశారు. ఈ ఇద్దరూ తమ విశ్వరూపం చూపిస్తూ.. పంజాబ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సాల్ట్‌, నరైన్‌లు ఎడాపెడా బౌండరీలు బాదడంతో 8 ఓవర్లకే స్కోర్‌ 100 దాటింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న నరైన్‌ను.. రాహుల్‌ చాహర్‌ వెనక్కి పంపడంతో 138 పరుగుల వద్ద తొలి వికెట్‌ పడింది. ఆ క్షణం పంజాబ్‌ జట్టు కాసింత ఊపిరి పీల్చుకుంది. అకాసేపటికే సాల్ట్‌ వెనుదిరిగినా.. వెంకటేశ్‌ అయ్యర్‌(39 నాటౌట్‌), ఆండ్రూ రస్సెల్‌(24) మెరుపులతో 16 ఓవర్లకే స్కోర్‌ 200 మార్క్‌ దాటింది. అప్పటికే అదిరిపోయిన పంజాబ్‌ బౌలర్లపై శ్రేయస్‌ అయ్యర్‌(28) సునామీలా విరుచుకుపడ్డాడు. సామ్‌ కరన్‌ వేసిన 18వ ఓవర్లో వరుసగా 6, 4, 6, 6 బాది కోల్‌కతాకు భారీ స్కోర్‌ అందించాడు. ఆ తర్వాత రింకూ సింగ్‌(5), రమన్‌దీప్‌ సింగ్‌()లు ధనాధన్‌ ఆడడంతో కేకేఆర్‌ రన్స్‌ కొట్టింది. చివర్లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(28) వీరవిహారం చేశాడు. వెంకటేశ్‌ అయ్యర్‌(39 నాటౌట్‌)తో కలిసి ఈడెన్స్‌లో బౌండరీల మోత మోగించాడు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు 43 రన్స్‌ జోడించారు. దాంతో, పంజాబ్‌కు కోల్‌కతా దాదాపు అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బెయిర్‌స్టోకు లభించింది.

స్కోర్‌బోర్డు…
కోల్‌కతా నైట్‌రైడర్స్‌: సాల్ట్‌ (బి)సామ్‌ కర్రన్‌ 75, నరైన్‌ (సి)బెయిర్‌స్టో (బి)రాహుల్‌ చాహర్‌ 71, వెంకటేశ్‌ అయ్యర్‌ (రనౌట్‌) జితేశ్‌ శర్మ 39, రస్సెల్‌ (సి)హర్షల్‌ పటేల్‌ (బి)ఆర్ష్‌దీప్‌ సింగ్‌ 24, శ్రేయస్‌ అయ్యర్‌ (సి)రబడా (బి)ఆర్ష్‌దీప్‌ 28, రింకు సింగ్‌ (సి)అషుతోష్‌ శర్మ (బి)హర్షల్‌ పటేల్‌ 5, రమన్‌దీప్‌ సింగ్‌ (నాటౌట్‌) 6, అదనం 13. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 261పరుగులు.

వికెట్ల పతనం: 1/138, 2/163, 3/203, 4/246, 5/253, 6/261
బౌలింగ్‌: సామ్‌ కర్రన్‌ 4-0-60-1, ఆర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-45-2, హర్షల్‌ పటేల్‌ 3-0-48-1, రబడా 3-0-52-0, రాహుల్‌ చాహర్‌ 4-0-33-1, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 20-21-0

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభుసిమ్రన్‌ (రనౌట్‌) నరైన్‌ 54, బెయిర్‌స్టో (నాటౌట్‌) 108, రూసో (సి)శ్రేయస్‌ (బి)నరైన్‌ 26, శశాంక్‌ (నాటౌట్‌) 68, అదనం 6. (20 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 262పరుగులు.
వికెట్ల పతనం: 1/93, 2/178
బౌలింగ్‌: ఛమీర 3-0-48-0, హర్షీత్‌ రాణా 4-0-61-0, అనుకుల్‌ రాయ్ 2-0-36-0, నరైన్‌ 4-0-24-1, చక్రవర్తి 3-0-46-0, రస్సెల్‌ 2-0-36-0, రమణ్‌ దీప్‌ సింగ్‌ 0.4-0-9-0

➡️