సాయి సుదర్శన్‌, గిల్‌ సెంచరీల మోత

May 11,2024 08:22 #Sports

– తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం
– గుజరాత్‌ చేతిలో చెన్నై చిత్తు
అహ్మదాబాద్‌: ప్లే-ఆఫ్‌ దారులు మూసుకు పోయిన గుజరాత్‌ జెయింట్‌కు ఊరట విజయం లభించింది. హ్యాట్రిక్‌ ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఝలక్‌ ఇచ్చింది. చెన్నై సూపర్‌కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జట్టు 35 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ ఓపెనర్లు సెంచరీల కదం తొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 231పరుగుల భారీస్కోర్‌ నమోదు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఓటమిపాలైంది. గిల్‌, సాయి సుదర్శన్‌ జోడీ తొలి వికెట్‌కు ఏకంగా 210 పరుగు లు చేసి రికార్డు పుటల్లో కెక్కారు. 2022లో కెఎల్‌ రాహుల్‌-డికాక్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై తొలి వికెట్‌ కు 210 పరుగుల భాగస్వామ్యాన్ని సమం చేశారు.
టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే, తమ సొంతగడ్డపై మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌ రికార్డు సెంచరీల మోత మోగించారు. సాయి సుదర్శన్‌ 51బంతుల్లో 5ఫోర్లు, 7సిక్సర్లతో 103 పరుగులు చేయగా… కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ 55బంతుల్లో 9ఫోర్లు, 6సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్‌, గిల్‌ ఎడాపెడా బాదేస్తూ స్కోరుబోర్డును పరుగెత్తించారు. గిల్‌ సెంచరీకి ఓ ప్రత్యేకత ఉంది. ఐపిఎల్‌ టోర్నీ చరిత్రలో ఇది 100వ సెంచరీ కావడం విశేషం. అయితే, గిల్‌, సాయి సుదర్శన్‌ జోడీ చివర్లో నిదానించడంతో స్కోరు కూడా మందగించింది. ఆఖర్లో వచ్చిన డేవిడ్‌ మిల్లర్‌ (11నాటౌట్‌), షారుఖ్‌ ఖాన్‌ (2) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో గుజరాత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 231పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. చెన్నై బౌలర్లలో తుషార్‌ దేశ్‌ పాండే 2వికెట్లు దక్కాయి. ఛేదనలో చెన్నై ఓపెనర్లు నిరాశపరిచినా.. మిఛెల్‌(63), మొయిన్‌ అలీ(56) అర్ధసెంచరీలతో రాణించారు. జడేజా (18), ధోనీ(26నాటౌట్‌), దూబే(21) ఫర్వాలేదనిపించారు. మోహిత్‌ శర్మకు మూడు, రషీద్‌ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు…
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (సి)దూబే (బి)దేశ్‌పాండే 103, శుభ్‌మన్‌ గిల్‌ (సి)జడేజా (బి)దేశ్‌పాండే 104, డేవిడ్‌ మిల్లర్‌ (నాటౌట్‌) 16, షారుక్‌ ఖాన్‌ (రనౌట్‌)రవీంద్ర/ సిమ్రన్‌జీత్‌ 2, అదనం 6. (20ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 231పరుగులు.వికెట్ల పతనం: 1/210, 2/213, 3/231బౌలింగ్‌: సాంట్నర్‌ 2-0-31-0, దేశ్‌పాండే 4-0-33-2, శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-25-0, సిమ్రన్‌జీత్‌ సింగ్‌ 4-0-60-0, జడేజా 2-0-29-0, మిఛెల్‌ 4-0-52-0.
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి)తెవాటియా (బి)వారియర్‌ 1, రవీంద్ర (రనౌట్‌)డేవిడ్‌ మిల్లర్‌ 1, గైక్వాడ్‌ (సి)రషీద్‌ ఖాన్‌ (బి)ఉమేశ్‌ యాదవ్‌ 0, మిఛెల్‌ (సి)షారుక్‌ ఖాన్‌ (బి)మోహిత్‌ శర్మ 63, మొయిన్‌ అలీ (సి)నూర్‌ అహ్మద్‌ (బి)మోహిత్‌ శర్మ 56, దూబే (సి)నూర్‌ అహ్మద్‌ (బి)మోహిత్‌ శర్మ 21, జడేజా (సి)డేవిడ్‌ మిల్లర్‌ (బి)రషీద్‌ ఖాన్‌ 18, ధోనీ (నాటౌట్‌) 26, సాంట్నర్‌ (బి)రషీద్‌ ఖాన్‌ 0, శార్దూల్‌ ఠాకూర్‌ (నాటౌట్‌) 3, అదనం 7. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 196పరుగులు. వికెట్ల పతనం: 1/2. 2/2, 3/10, 4/119, 5/135, 6/165, 7/169, 8/169 బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 3-0-20-1, సందీప్‌ వారియర్‌ 3-0-28-1, కార్తీక్‌ త్యాగి 4-0-51-0, నూర్‌ అహ్మద్‌ 2-0-25-0, రషీద్‌ ఖాన్‌ 4-0-38-2, మోహిత్‌ శర్మ 4-0-31-3

➡️