మళ్లీ మెరిసిన సాయి సుదర్శన్‌

Dec 20,2023 09:17 #Sports

– కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ కూడా..

– భారత్‌ 211ఆలౌట్‌

– దక్షిణాఫ్రికాతో రెండో వన్డే

గబెర్రా(సెయింట్‌ జార్జెస్‌): రెండో వన్డేలో భారత బ్యాటర్స్‌ చేతులెత్తేశారు. యువ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌కు తోడు కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ మాత్రమే అర్ధసెంచరీలతో ఆదుకోగా.. మిగతా బ్యాటర్స్‌ నిరాశపరిచారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 46.2 ఓవర్లలో 211పరుగులకు ఆలౌటైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా యువ బ్యాటర్లు తడబడ్డారు. తొలి బంతికే బౌండరీ బాదిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. రెండో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. వన్‌ డౌన్‌లో వచ్చిన తిలక్‌ వర్మ(10) కూడా విఫలమయ్యాడు. ఈ రెండు వికెట్లూ బర్గర్‌కే దక్కాయి. 46పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను తొలి వన్డే హీరో సాయి సుదర్శన్‌, కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌లు ఆదుకున్నారు. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (62; 83 బంతుల్లో 7ఫోర్లు, సిక్సర్‌), కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ (56; 64బంతుల్లో, 7ఫోర్లు) ఆదుకున్నారు. తొలుత నెమ్మదిగా బ్యాటింగ్‌ చేసినా ఆ తర్వాత స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. అరంగేట్రం చేసిన తొలి వన్డేలోనే అర్థ సెంచరీ చేసిన సాయి.. ఈ మ్యాచ్‌లో కూడా మరో అర్ధసెంచరీతో సత్తా చాటాడు. చివరకు లిజాడ్‌ విలియమ్స్‌ వేసిన 27వ ఓవర్లో వికెట్‌ కీపర్‌ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు. ఆ తర్వాత మిగిలినవారంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. రాకరాక వచ్చిన అవకాశాన్ని సంజూ శాంసన్‌(12) వినియోగించుకోలేదు. వన్డేల్లో అరంగేట్రం చేసిన రింకూ సింగ్‌(17) కూడా కట్టుకోలేదు. అక్షర్‌ పటేల్‌(7), కుల్దీప్‌ యాదవ్‌(1) అలా వచ్చి ఇలా వెళ్లారు. చివర్లో ఆర్ష్‌దీప్‌ సింగ్‌(18; 17బంతుల్లో, ఫోర్‌, సిక్సర్‌) దీంతో భారత ఇన్నింగ్స్‌ 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్‌ అయింది. దక్షిణాఫ్రికా పేసర్లలో బర్గర్‌కు మూడు, హెండ్రిక్స్‌, కేశవ్‌ మహరాజ్‌కు రెండేసి, విలియమ్స్‌, మార్‌క్రమ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి. మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యతలో ఉన్న సంగతి తెలిసిందే.

స్కోర్‌బోర్డు.. భారత్‌ ఇన్నింగ్స్‌: గైక్వాడ్‌ (ఎల్‌బి)బర్గర్‌ 4, సాయి సుదర్శన్‌ (సి)క్లాసెన్‌ (బి)విలియమ్స్‌ 62, తిలక్‌ వర్మ (సి)హెండ్రిక్స్‌ (బి)బర్గర్‌ 10, కెఎల్‌ రాహుల్‌ (సి)మిల్లర్‌ (బి)బర్గర్‌ 56, సంజు శాంసన్‌ (బి)హెండ్రిక్స్‌ 12, రింకు సింగ్‌ (స్టంప్‌)క్లాసెన్‌ (బి)మహరాజ్‌ 17, అక్షర్‌ పటేల్‌ (సి)వెర్రెయన్నె (బి)మార్‌క్రమ్‌ 7, కుల్దీప్‌ యాదవ్‌ (సి)హెండ్రిక్స్‌ (బి)మహరాజ్‌ 1, ఆర్ష్‌దీప్‌ సింగ్‌ (సి)మిల్లర్‌ (బి)హెండ్రిక్స్‌ 18, ఆవేశ్‌ ఖాన్‌ (రనౌట్‌)ముల్డర్‌ 9, ముఖేశ్‌ కుమార్‌ (నాటౌట్‌) 4, అదనం 11. (46.2ఓవర్లలో ఆలౌట్‌) 211పరుగులు.

వికెట్ల పతనం: 1/4, 2/46, 3/114, 4/136, 5/167, 6/169, 7/172, 8/186, 9/204, 10/211

బౌలింగ్‌: బర్గర్‌ 10-0-30-3, విలియమ్స్‌ 9-1-49-1, హెండ్రిక్స్‌ 9.2-1-34-2, ముల్డర్‌ 4-0-19-0, కేశవ్‌ మహరాజ్‌ 10-0-51-2, మార్‌క్రమ్‌ 4-0-28-1.

➡️