ఆధిక్యత దిశగా దక్షిణాఫ్రికా

Dec 27,2023 22:20 #Sports

-ఎల్గర్‌ సెంచరీ

-దక్షిణాఫ్రికా 248/4

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ సెంచరీతో కదం తొక్కాడు. భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌ బై చెబుతున్నట్లు ప్రకటించిన ఎల్గర్‌ సెంచరీ (135, 23ఫోర్లు)తో కదం తొక్కాడు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న ఎల్గర్‌.. శతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌పై ఆధిక్యతను సంపాదించింది. బెడింగ్హామ్‌(56) అర్ధసెంచరీతో రాణించాడు. ఠాకూర్‌ వేసిన 22వ ఓవర్లో బౌండరీ కొట్టి 79బంతుల్లో అర్థ సెంచరీ చేసిన ఎల్గర్‌.. అతడే వేసిన 43వ ఓవర్లో తొలి బంతికి మిడ్‌ వికెట్‌ దిశగా ఆడి సెంచరీని పూర్తిచేసుకున్నాడు. టెస్టులలో అతడికి ఇది 14వ సెంచరీ. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే ఎయిడెన్‌ మార్‌క్రమ్‌(5) ఔటయ్యాడు. రెండో వికెట్‌కు ఎల్గర్‌.. టోనీ డి జోర్జి(28) 93పరుగులు జోడించారు. ఈ జోడీని బుమ్రా విడదీశాడు. వరుస ఓవర్లలో బుమ్రా.. జోర్జి, కీగన్‌ పీటర్సన్‌(2)ను ఔట్‌ చేశాడు. బుమ్రా, సిరాజ్‌ కాస్త ఫర్వాలేదనిపించినా శార్దూల్‌ ఠాకూర్‌, ప్రసిధ్‌ కృష్ణలు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. టీ విరామ సమయానికి దక్షిణాఫ్రికా జట్టు 49ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 194పరుగులు చేసింది. ఆ సమయానికి క్రీజ్‌లో ఎల్గర్‌(115), బెడింగ్హామ్‌(32) ఉన్నారు. కెఎల్‌ రాహుల్‌ సెంచరీ..టీమిండియా వికెట్‌ కీపర్‌ కెఎల్‌ రాహుల్‌ సెంచరీతో కదం తొక్కి ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాపై వికెట్‌ కీపర్‌గా సెంచరీ కొట్టి రెండో బ్యాటర్‌గా కెఎల్‌ రాహుల్‌ నిలిచాడు. అంతకుముందు రిషబ్‌ పంత్‌ సఫారీ జట్టుపై వికెట్‌ కీపర్‌ హోదాలో తొలిసారి సెంచరీని కొట్టాడు. గత ఏడాది భారతజట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు రాగా కేప్‌టౌన్‌లో రిషబ్‌ పంత్‌ తొలిసారి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే సెంచూరియన్‌లో వరుసగా రెండు సెంచరీలు కొట్టిన తొలి బ్యాటర్‌ కూడా కెఎల్‌ రాహుల్‌ మాత్రమే. వర్షం అడ్డంకిరెండోరోజు ఆట ప్రారంభానికి కూడా వరుణుడు అడ్డు తగిలాడు. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో ఆట ఆలస్యమైంది. తొలిరోజు కూడా వెలుతురు లేమి కారణంగా 59 ఓవర్లే మ్యాచ్‌ జరిగింది. చివరి సెషన్‌లో వర్షం పడడంతో నిర్ణీత సమయం కంటే ముందే ఆట ముగిసిన విషయం తెలిసిందే.

స్కోర్‌బోర్డు..

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 245

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ (సి)రాహుల్‌ (బి)సిరాజ్‌ 5, ఎల్గర్‌ (బ్యాటింగ్‌) 117, జోర్జి (సి)జైస్వాల్‌ (బి)బుమ్రా 28, పేటర్సన్‌ (బి)బుమ్రా 2, బెడింగ్హామ్‌ (బ్యాటింగ్‌) 37

వికెట్ల పతనం: 1/11, 2/104, 3/113

బౌలింగ్‌: బుమ్రా 13-1-30-2,

సిరాజ్‌ 10-0-39-1,

శార్దూల్‌ ఠాకూర్‌ 11-2-50-0

ప్రసిధ్‌ కృష్ణ 10-2-51-0

అశ్విన్‌ 8-3-19-0

 

➡️