Record: టెస్టుల్లో శ్రీలంక అరుదైన ఘనత.. టీమిండియా రికార్డు బద్దలు

Apr 1,2024 11:52 #48, #Broken, #India, #records, #Sri Lanka, #years

శ్రీలంక : శ్రీలంక పురుషుల క్రికెట్‌ జట్టు అరుదైన రికార్డు సాధించింది. ఓ ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండా.. అత్యధిక స్కోర్‌ చేసిన జట్టుగా శ్రీలంక నిలిచింది. ఛటోగ్రామ్‌లోని జహుర్‌ అహ్మద్‌ చౌదరి స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఈ రికార్డు సాధించడంతో… 48 ఏళ్ల క్రితం భారత్‌ నెలకొల్పిన రికార్డు బద్దలైంది. 1976లో భారత్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండా 529 పరుగులు చేయగా.. తాజాగా శ్రీలంక శతకం లేకుండా 531 పరుగులు చేసింది. ఈ విధంగా 48 ఏళ్ల భారత్‌ రికార్డును శ్రీలంక బ్రేక్‌ చేసింది..!

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 531 పరుగులకు ఆల్‌ అవుట్‌ అయ్యింది. చివరి ఇద్దరు బ్యాటర్లు మినహా తొమ్మిది మంది రెండంకెల స్కోరు చేశారు. నిషాన్‌ మదుష్క (57), దిముత్‌ కరుణరత్నే (86), కుసాల్‌ మెండిస్‌ (93), దినేష్‌ చండిమాల్‌ (59), ధనంజయ డి సిల్వా (70), కమిందు మెండిస్‌ (92) అర్ధ శతకాలు సాధించారు. ఏంజెలో మ్యాథ్యూస్‌ (23), జయసూర్య (28), విశ్వ ఫెర్నాండో (11) రెండంకెల స్కోరు చేశారు. కాన్పూర్‌లో 1976లో న్యూజిలాండ్‌పై భారత్‌ 524/9 స్కోరు చేసి డిక్లేర్డ్‌ చేసింది. బిషన్‌ సింగ్‌ బేడీ భారత జట్టుకు నాయకత్వం వహించగా.. ఆరుగురు భారత ఆటగాళ్లు అర్ద సెంచరీలు చేశారు. ఇప్పటివరకు ఇదే రికార్డు కాగా.. తాజాగా శ్రీలంక ఆ రికార్డు బద్దలు కొట్టింది. 2009లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా 520/7 (డిక్లేర్డ్‌), 1998లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 517, 1981లో ఆస్ట్రేలియాపై పాకిస్తాన్‌ 500/8 (డిక్లేర్డ్‌) ఒక్క సెంచరీ లేకుండా భారీ స్కోర్లు సాధించాయి.

➡️