సూపర్‌ సన్‌రైజర్స్‌

May 20,2024 07:57 #Cricket, #IPL, #Sports
  • పంజాబ్‌ కింగ్స్‌పై అదిరే విజయం
  • ఛేదనలో అభిషేక్‌, క్లాసెన్‌, నితీశ్‌ జోరు
  • రెండో స్థానంపై హైదరాబాద్‌ ఆశలు!

హైదరాబాద్‌ : పంజాబ్‌ కింగ్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఊదేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచేందుకు తన చేతుల్లో ఉన్న పని చేసేసింది. భారీ ఛేదనలో ట్రావిశ్‌ హెడ్‌ (0) నిరాశపరిచినా.. అభిషేక్‌ శర్మ (66, 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (42, 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (37, 25 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి (33, 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కదం తొక్కటంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అలవోక విజయం సాధించింది. పంజాబ్‌ కింగ్స్‌ ఏ దశలోనూ సన్‌రైజర్స్‌ను ఇరకాటంలో పడేయలేకపోయింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఓపెనర్‌ ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (71, 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), రోసో (49, 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అథ్వర (46, 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. పంజాబ్‌ కింగ్స్‌ 14 మ్యాచుల్లో తొమ్మిదో పరాజయంతో సీజన్‌ను ముగించగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గ్రూప్‌ దశలో 14 మ్యాచుల్లో ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో టాప్‌-2 నిలిచేందుకు ఎదురుచూస్తుంది!. ఛేదనలో ధనాధన్‌ అర్థ సెంచరీ సాధించిన సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
215 ఊదేశారు : ప్లే ఆఫ్స్‌ ముంగిట సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ లక్ష్యాన్ని ఊదేసింది. ప్రమాదకర ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ (0) తొలి బంతికే నిష్క్రమించినా.. సన్‌రైజర్స్‌ దూకుడు తగ్గలేదు. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (66)తో కలిసి రాహుల్‌ త్రిపాఠి (33) పవర్‌ప్లేలో దంచికొట్టాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో త్రిపాఠి పవర్‌ప్లేలో చెలరేగాడు. నెమ్మదిగా మొదలెట్టిన అభిషేక్‌ శర్మ.. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 21 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన అభిషేక్‌ శర్మ ఛేదనను లాంఛనం చేశాడు. రాహుల్‌ త్రిపాఠి, అభిషేక్‌ శర్మ నిష్క్రమించినా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (37), హెన్రిచ్‌ క్లాసెన్‌ (42) అదరగొట్టారు. క్లాసెన్‌ తనదైన శైలిలో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో విశ్వరూపం చూపించగా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో ఆకట్టుకున్నాడు. ఆఖరు ఓవర్లో 4 పరుగులు అవసరం కాగా.. అబ్దుల్‌ సమద్‌ (11 నాటౌట్‌), సన్వీర్‌ సింగ్‌ (6 నాటౌట్‌) తొలి బంతికే లాంఛనం ముగించారు. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ (2/37), హర్షల్‌ పటేల్‌ (2/49) రెండేసి వికెట్లతో రాణించారు.
మెరిసిన ప్రభుసిమ్రన్‌ : టాస్‌ నెగ్గిన పంజాబ్‌ కింగ్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ బౌలర్లను ఎదుర్కొని పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్లు దంచికొట్టారు. ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (71), అథర్వ (46) తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించారు. పవర్‌ప్లేలో 61 పరుగులు జోడించిన ఓపెనర్లు.. ఆ తర్వాత జోరు కొనసాగించారు. ప్రభుసిమ్రన్‌ సింగ్‌ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా..అర్థ సెంచరీ ముంగిట అథర్వ వికెట్‌ కోల్పోయాడు. నం.3 బ్యాటర్‌ రోసో (49) సైతం నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో మెరిశాడు. అశుతోష్‌ (32) రాణించటంతో డెత్‌ ఓవర్లలో పంజాబ్‌ కింగ్స్‌ భారీగా పరుగులు పిండుకుంది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి మూడు ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకున్నాడు. టాప్‌-3 బ్యాటర్లు రాణించటంతో పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఒకే విదేశీ క్రికెటర్‌ తుది జట్టులో నిలిచాడు.

➡️