కోట్లు కొల్లగొట్టేదెవరో..? నేడు ఐపిఎల్‌-2024 మినీ వేలం

Dec 19,2023 10:24 #Cricket, #IPL
  • 77భర్తీలకు రేసులో 333మంది 

దుబాయ్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌-2024) మినీ వేలానికి రంగం సిద్దమైంది. మినీ వేలం ఈసారి దుబాయ్ వేదికగా మంగళవారం జరగనుంది. ఐపిఎల్‌-2024 మినీ వేలానికి మొత్తం 1166మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఐపిఎల్‌ నిర్వాహకులు 333మంది ప్లేయర్లను షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఇందులో 214మంది భారత ప్లేయర్స్‌ కాగా, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం గరిష్టంగా 77 మాత్రమే ఖాళీగా ఉండగా.. ఇందులో 30 ఓవర్‌ సీస్‌ స్లాట్స్‌ ఉన్నాయి. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌ వద్ద అత్యధికంగా రూ.38.15 కోట్లు, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ వద్ద అత్యల్పంగా రూ.13.15 కోట్ల సొమ్ము ఉంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు ఈ వేలానికి సంబంధించిన ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయి. ఈసారి వేలంలో ఆక్షనీర్‌గా మల్లికా సాగర్‌ వ్యవహరించనున్నారు. దీంతో ఐపిఎల్‌ వేలంలో ఆక్షనీర్‌గా వ్యవహరించనున్న తొలి మహిళగా ఆమె చరిత్రకెక్కనుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీలు 11మంది ఆటగాళ్లను విడుదల చేశాయి. గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను ముంబయి ఇండియన్స్‌ ఇచ్చి పుచ్చుకొని ధోరణిలో కోల్పోగా.. రోహిత్‌ శర్మతో ఢిల్లీ ప్రాంచైజీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

రికార్డుకెక్కనున్న మల్లిక..

48ఏళ్ల మల్లిక సాగర్‌ ముంబయికి చెందిన ఆర్ట్‌ కలెక్టర్‌. ఆమె తొలుత ఉండోల్‌ ఆర్ట్‌ గ్యాలరీలో వేలాన్ని నిర్వహించేది. వేలంలో దాదాపు 25 సంవత్సరాల అనుభవం మల్లిక ఉమెన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌-2023 వేలంతో పాటు డబ్యూపిఎల్‌ 2024 వేలానికి కూడా ఆమె ఆక్షనీర్‌గా పనిచేసింది. ప్రొకబడ్డీ లీగ్‌-2021నుంచి వరుసగా పికెఎల్‌ వేలాన్ని నిర్వహిస్తోంది. దీంతో ఐపిఎల్‌ వేలం తొలి ఆక్షనీర్‌గా ఆమె రికార్డులకెక్కనుంది. 16ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో వేలాన్ని నిర్వహించనున్న తొలి మహిళ కూడా మల్లికనే. 2008 నుంచి 2018 వరకు రిచర్డ్‌ మాడ్లీ వేలంపాటదారుగా బాధ్యతలు నిర్వర్తించాడు. దశాబ్ద కాలం పాటు అతడే వరుసగా ఆక్షన్‌ నిర్వహించాడు. అయితే 2018 నుంచి ఆక్షనీర్‌ బాధ్యత హ్యు ఎడ్మిడ్స్‌ అందుకున్నాడు. కానీ 2022 మెగా వేలంలో ఎడ్మిడ్స్‌ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చాయ్ శర్మ ఆ వేలాన్ని కొనసాగించాడు.

అన్ని ఫ్రాంచైజీల చూపు రచిన్‌ రవీంద్రవైపే..

ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో రాణించిన న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్రపైనే అన్ని ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. మినీ వేలంలో అతడు కోట్లు కొల్లగొడతాడని సమాచారం. రచిన్‌ రవీంద్రతోపాటు వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ విజేత ఆస్ట్రేలియా పేసర్లు పాట్‌ కమిన్స్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, మిఛెల్‌ స్టార్స్‌లకు ఈసారి వేలం భారీ ధర పలికవచ్చు.

ఫ్రాంచైజీల వారీగా అందుబాటులో ఉన్న పర్స్‌ వాల్యూ

  1. గుజరాత్‌ టైటాన్స్‌ : రూ. 38.15 కోట్లు
  2. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ :రూ. 34 కోట్లు
  3. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ : రూ. 32.7 కోట్లు
  4. చెన్నై సూపర్‌ కింగ్స్‌ : రూ. 31.4 కోట్లు
  5. పంజాబ్‌ కింగ్స్‌ : రూ. 29.1 కోట్లు
  6. ఢిల్లీ క్యాపిటల్స్‌ : రూ.28.95 కోట్లు
  7. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు :రూ.23.25 కోట్లు
  8. ముంబయి ఇండియన్స్‌ : రూ.17.75 కోట్లు
  9. రాజస్థాన్‌ రాయల్స్‌ : రూ. 14.5 కోట్లు
  10. లక్నో సూపర్‌జెయింట్స్‌ :రూ. 13.5 కోట్లు

తెలుగు రాష్ట్రాల నుంచి 13 మంది

2024 ఐపిఎల్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి 13 మంది ఆటగాళ్లు బరిలో ఉన్నారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి 9మంది, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి నలుగురు వేలం రేసులో ఉన్నారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి మురుగన్‌ అభిషేక్‌, రాహుల్‌ బుద్ది, రోహిత్‌ రాయుడు, అనికేత్‌ రెడ్డి, రవితేజ, తనరు త్యాగరాజన్‌, ఆరవెల్లి అవినాష్‌ రావు, రక్షన్‌ రెడ్డి, మనీష్‌ రెడ్డి బరిలో ఉన్నారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి హనుమా విహారి, కేఎస్‌ భరత్‌, రికీ భురు, పథ్వీరాజ్‌ ఎర్రా బరిలో ఉన్నారు. వీరిలో కొందరు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. హనుమ విహారి, కెఎస్‌ భరత్‌లాంటి ఆటగాళ్లు టీమిండియా టెస్టు జట్టులో ఆడారు. తిలక్‌ వర్మ, మహ్మద్‌ సిరాజ్‌ ఐపిఎల్‌లో రాణించి జాతీయ జట్టుకు ఎంపికైనవారే.

➡️