పేదల భూములను కాపాడండి : సిపిఎం

Jun 24,2024 21:32

 సమస్యను జేసీకి వివరిస్తున్న నాయకులు

            పుట్టపర్తి అర్బన్‌ : పేదోళ్ల భూములపై పెద్దోళ్లు కన్నేసి దౌర్జన్యం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇఎస్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ పుట్టపర్తి మండలం కప్పలకొండ గ్రామ సర్వే నెంబరు 308-2ఎ, 308-3సి లో 5.13 ఎకరాలు సర్వే నెంబర్‌ 179-1లో 4.40 ఎకరాలు బోయ సాకే చిన్న నరసింహులు సాకే శ్రీనివాసులు సాకే సుధాకర్‌ సాగు చేసుకుంటున్నారన్నారు. అయితే సాయి రమేష్‌, బొగ్గరం రామకృష్ణ, జగదీష్‌, శ్రీరాం నాయక్‌ అనే వ్యక్తులు దౌర్జన్యం చేస్తున్నారన్నారు. పేదలు తమ పెద్దలనుంచి సాగులో ఉన్న భూమిని తమ హక్కుగా అనుభవిస్తున్నారన్నారు. ఆ భూమికి సంబందించి వారి దగ్గర ఉన్న పత్రాలు కాలిపోయిన కారణంగా ధనవంతులు వారిని బెదిరిస్తున్నారన్నారు. రెవిన్యూ రికార్డులలో పేదల హక్కుల అనుభవం ఉన్నప్పటికీ విలువ గల భూమిని కాజేయాలని చూస్తున్నారని అన్నారు. పేదల భూమి పేదలకే దక్కాలని ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పైపల్లె గంగాధర్‌, బాళ్ల అంజి, బాధితులు శ్రీనివాసులు నరసింహులు లక్ష్మీనరసింహ తదితరులు పాల్గొన్నారు.

➡️