తల్లి అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ సోదరుడు..!

Jan 31,2024 16:59 #Cricket, #Sports, #Virat Kohli

ఢిల్లీ : వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌ల నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. కోహ్లీ తన తల్లి అనారోగ్యం కారణంగా మొదటి రెండు టెస్టుల నుంచి విరామం కోరాడని, మిగిలిన మూడు టెస్టులకు కూడా అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈవార్తలపై విరాట్‌ కోహ్లీ సోదరుడు వికాస్‌ కోహ్లీ స్పందించాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరాడు. ‘అందరికీ నమస్కారం. మా అమ్మ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయని గమనించాను. మా అమ్మ ఆరోగ్యంగా, పూర్తిగా ఫిట్‌గా ఉన్నారు. సరైన సమాచారం లేకుండా అలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని నేను ప్రతి ఒక్కరినీ మరియు మీడియాను కూడా అభ్యర్థిస్తున్నా’ అని వికాస్‌ కోహ్లీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ఇంగ్లాండ్‌తో చివరి మూడు టెస్టులకు త్వరలోనే భారత సెలక్షన్‌ కమిటీ జట్టును ప్రకటించనుంది. ఈ మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉంటాడా? లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. సిరీస్‌లో భారత్‌ 0-1తో వెనకబడి ఉంది.

➡️