గవర్నర్‌ తీరుపై కేరళ సిఎం స్పందన

Jan 28,2024 13:48

తిరువనంతపురం (కేరళ) : తన కాన్వాయ్ వెళుతుండగా నిరసన తెలిపిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్టు చేయాలని రోడ్డు పక్కన కూర్చొని కేరళ గవర్నర్‌ పోలీసులను డిమాండ్‌ చేయడంపై రాష్ట్ర సిఎం పినరయి విజయన్‌ స్పందించారు.

” ప్రస్తుతం కేరళలో సిఆర్‌పిఎఫ్‌ పాలన కొనసాగుతోందా ?ఈ సాయుధ దళాలు కేసు నమోదు చేస్తాయా ? రాష్ట్రంలో ఆ దళాలను మోహరించడం విచిత్రంగా ఉంది. పోలీసులు పద్ధతి ప్రకారం నడుచుకోవడం లేదని గవర్నర్‌ ఆరోపించారు. మరి ఇప్పుడు ఆయన కోరుకున్న విధంగా సిఆర్‌పిఎఫ్‌ వ్యవహరిస్తుందా ?” అని సిఎం ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తులపై ఇలాంటి నిరసనలు సహజమేనని.. అలాంటి సమయంలో ప్రతిస్పందించే ముందు తన స్థాయిని గుర్తుపెట్టుకోవాలని గవర్నర్‌కు సిఎం సూచించారు. తాను చాలా సార్లు ప్రయాణాలు చేశానని.. కానీ ఇలా ఎప్పుడు కారు నుంచి దిగిపోలేదన్నారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం దేశంలో ఎన్నడూ జరగలేదన్నారు. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గన్న ఆరిఫ్‌.. కేరళ పోలీసులపై ప్రశంసలు కురిపించిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. ప్రస్తుతం వారు కల్పించే భద్రత ఆయనకు సరిపోదా అని అడిగారు. తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్‌ భద్రతను కేంద్ర హౌంశాఖ పెంచిన విషయం తెలిసిందే. ఆయనకు కేంద్రం జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించినట్లు కేరళ రాజ్‌భవన్‌ వెల్లడించింది.

➡️