గ్రంథాలయంలో చిన్నారుల సందడి

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జూన్‌ 7 వరకు జరిగే వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా నాలుగో రోజైన ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చిన్నారులతో పుస్తక పఠనం చేయించారు. పాటలు పాడించారు. ఉపాధ్యాయులు దాసరి లక్ష్మీప్రసాద్‌ తెలుగు భాషలో గుణింతాలు రాయించటం, పుల్లలతో వస్తువులు ఎలా తయారు చేయాలో, తెలుగు వ్యాకరణంలో అక్షరాలు గుర్తించటం నేర్పించారు. సిహెచ్‌ సుధాకరరావు పుస్తక సమీక్ష గురించి పిల్లలకు వివరించారు. ఉపాధ్యాయులు, కవి జాలాది మోహన్‌ పిల్లలకు నీతి కథలు చెప్పటం, పిల్లలతో కథలు చెప్పించడం, మ్యాథ్స్‌ పజిల్స్‌ నేర్పించారు. ఉపగ్రంథపాలకురాలు బొమ్మల కోటేశ్వరి మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రోత్సహించి వేసవి విజ్ఞాన శిబిరానికి పంపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది కె సంపూర్ణమ్మ, డి సందీప్‌, పి ఇమ్మానుయేలు, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్‌ పి పేరయ్య, నున్నా ఆంజనేయులు, 36 మంది చిన్నారులు పాల్గొన్నారు.

➡️