గిరిజనుల కష్టాలు తీరేదెన్నడో..?

Apr 21,2024 22:12

ఎన్నికల హామీగానే పూర్ణపాడు- లాబేసు వంతెన

పట్టించుకోని టిడిపి, వైసిపి పాలకులు

19 ఏళ్లయినా పూర్తికాని వైనం

40 గ్రామాల సమస్యపై తీవ్ర నిర్లక్ష్యం

ప్రజాశక్తి-కొమరాడ  : అది 19 ఏళ్ల నాటి కల. ఏళ్లు గడుస్తున్నా..పాలకులు మారుతున్నా ఆ ప్రాంత గిరిజనుల కల మాత్రం సాకారం కావడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అదే ఎజెండా. అధికారం మారుతోంది. అందలం ఎక్కిన వారు ఎక్కుతున్నారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. అదే కొమరాడ మండలంలోని పూర్ణపాడు – లాబేసు వంతెన. గిరిజన సమస్యల పట్ల పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. 2004లో సిపిఎం ఎమ్మెల్యే ఆనాడు అసెంబ్లీలో ఈ వంతెన సమస్యను ప్రస్తావించారు. అలా కార్యరూపం దాల్చిన ఈ వంతెన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చినా టిడిపి, వైసిపి పాలనలో నేటికీ పూర్తి కాలేదు. సిపిఎం, వామపక్షాలు మాత్రం ఈ వంతెన సాధన కోసం నేటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. మరోసారి ఎన్నికల వేళ పూర్ణపాడు – లాబేసు వంతెన చర్చనీయాంశమవుతోంది. కొమరాడ మండలంలో తరతరాల నుండి నాగావళి నది దాటేందుకు ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 1996లో ఎఒబి సరిహద్దు ప్రాంతమైన వత్తాడ-రెబ్బ సమీపంలో నాగావళి నదిలో నాటు పడవ మునిగిపోయి 36 మంది నదిలో సమాధి అయిన ఘటన ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజల కళ్లముందు కదలాడుతూ ఉంటుంది. కొమరాడ మండలంలో తొమ్మిది పంచాయతీల ప్రజలు నాగావళి నది ఆవల ఉన్న గ్రామాల్లో జీవనం సాగిస్తున్నారు. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా, అవసరం వచ్చినా నాగావళి నది దాటుకుంటూ కొమరాడ రావలసిన పరిస్థితి ఉంటుంది. అయితే శీతాకాలం, వేసవి కాలంలో నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో గిరిజనుల రాకపోకలకు కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఏటా జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు వర్షాలు భారీగా పడడంతో నాగావళి నది నీటి ప్రవాహం పెరిగి ఉగ్రరూపం దాల్చుతుంది. ఆ సమయంలో నదిని దాటడమంటే గిరిజనులు ప్రాణాలకు తెగించాల్సిందే. అప్పుడప్పుడు మర పడవ సహాయంతో నది దాటేందుకు ప్రజలు ప్రయత్నిస్తుంటారు. నదీ ప్రవాహం అధికంగా ఉంటే పడవ రాకపోకలు నిలిచిపోతాయి. రోగులు అత్యవసర పరిస్థితుల్లో గత్యంతరం లేక నదిలో ప్రమాదకరంగా రాకపోకలు చేయాల్సిన దయనీయ పరిస్థితి. కొన్నిసార్లు పడవపై కూడా అత్యధికమంది ప్రయాణం చేయడంతో కొన్ని సందర్భాల్లో పడవ బోల్తా పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సిపిఎం ఎమ్మెల్యే ప్రస్తావనతో వంతెన ప్రతిపాదన కార్యరూపం అది 2005 డిసెంబరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయం. అప్పటిలో నాగూరు సిపిఎం ఎమ్మెల్యేగా ఉన్న కోలక లక్ష్మణమూర్తి అసెంబ్లీలో పూర్ణపాడు – లాబేసు వంతెన సమస్యను లేవనెత్తారు. అప్పటి గిరిజనశాఖ మంత్రి నిధుల కేటాయింపు సాధ్యం కాదన్నప్పుడు కోలక దీనివల్ల ప్రయోజనాలను క్షుణ్ణంగా వివరించారు. 1996లో వత్తాడ – రెబ్బ వద్ద పడవ మునిగి 32 మంది గిరిజనులు చనిపోయిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. చివరికి ప్రభుత్వం హామీ ఇస్తూ.. పూర్ణపాడు – లాబేసు మధ్య వంతెన నిర్మించాలని నిర్ణయించింది. తొలుత రూ.2.5 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. ఏడాది తర్వాత ఆ ఏడాది సెప్టెంబర్‌లో అప్పటి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. అనంతరం రూ.2.5 కోట్ల నుంచి రూ.నాలుగు కోట్లకు అంచనాలు పెంచి, ఆర్‌అండ్‌బికి నిర్మాణ బాధ్యత అప్పగించారు. మళ్లీ టెండర్లు పిలిచినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత మరోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పంచాయతీరాజ్‌శాఖా మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణను సిపిఎం నాయకులు కలిసి సమస్యను వివరించారు. ఈసారి మరోసారి అంచనా విలువ రూ.6 కోట్లకు పెరిగింది. పనులు మాత్రం ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రతిపాదనలు పెంచి ఈసారి రూ.9.98 కోట్లకు అంచనా వ్యయం పెంచారు. మళ్లీ శంకుస్థాపన చేసిన పనులు ప్రారంభించారు. అప్పటి ఒప్పందం ప్రకారం 2017 మే నాటికి ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఆ దిశగా పనులు చేయలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వంతెన పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పాలకుల నిర్లక్ష్యం కారణంగా సుమారు రూ.3కోట్లు వరకు ఐఎపి నిధులు వెనక్కి వెళ్ళిపోవడంతో వంతెన నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం నిర్మాణంపై పూర్తిగా దష్టి సారించలేదు. వైసిపి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పుష్పశ్రీవాణి ఈ వంతెన గురించి కనీసం పట్టించుకోలేదు. సిపిఎం తోపాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు నిరసనలతో అప్పట్లో మరో మూడు కోట్లు నిధులు అదనంగా కేటాయించామని, పనులు ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో ఇసుమంతైనా పని జరగలేదు. వంతెన పూర్తయి తమ కష్టాలు తీరుతాయని ఆశపడ్డ గిరిజనులకు తీవ్ర నిరాశ మిగిలింది.40 గ్రామాలకు ప్రయోజనంవంతెన పూర్తయితే ఆ మండలంలోని 10 పంచాయతీలకు చెందిన 40 గ్రామాలతోపాటు కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి మండలాల్లో అనేక గ్రామాలకు రాకపోకలకు వీలు ఏర్పడుతుంది. కొంత కాలం పనులకు టెండర్లు పిలవకుండా కాలక్షేపం చేశారు. మరికొంత కాలం నిధులు చాల్లేదని చెప్పారు. నిధులు మంజూరైనా కమీషన్లు కుదరక కొన్నాళ్లు పనులు నిలిచిపోయాయి. చివరకు కాంట్రాక్టర్‌ తనకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదంటూ పనులు నిలిపివేసి అక్కడి నుంచి చిత్తగించారు. దీంతో వంతెన నిర్మాణం నిలిచిపోయింది.ఎన్నికల హామీగా మాత్రమే మిగిలిపోతున్న వంతెనఎన్నికలు వచ్చిన ప్రతిసారి వంతెన పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం పాలకులకు పరిపాటిగా మారింది. చివరికి ఇది ఎన్నికల హామీగా మిగిలిపోతుందని గిరిజనులు అంటున్నారు. అధికారంలోకి వస్తే వంతెన పూర్తి చేస్తామని టిడిపి వైసిపి ప్రభుత్వాలు ప్రచారాలు చేసుకొని పబ్బం గడుపుకుంటున్నాయి తప్ప వంతెన నిర్మాణం మాత్రం పూర్తి చేయడం లేదు. పట్టించుకోని ఎమ్మెల్యేలు 1978 నుంచి 2004లో సిపిఎం ఎమ్మెల్యే మినహా అంతకముందు, తర్వాత చినమేరంగి కోట నుంచే ఎమ్మెల్యేలు గెలుపొందుతున్నా, ఈ వంతెన నిర్మాణంపై దృష్టి సారించలేదు. వంతెన శంకుస్థాపన చేసిన అప్పటి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, అంతకు ముందు ఎమ్మెల్యేగా గెలిచిన జనార్థన థాట్రాజ్‌, ప్రస్తుతం కురుపాం ఎమ్మెల్యేగా ఉన్న పుష్పశ్రీవాణి ఇలా ఒకే కుటుంబం నుంచి అధికారం చేపడుతున్నా, లక్షలాది ప్రజలకు సమస్యగా ఉన్న ఈ వంతెన నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వంతెన లేక రాకపోకలకు ఇబ్బందులు

దీర్ఘకాల సమస్యగా ఉన్న పూర్ణపాడు- లాబేసు వంతెన నిర్మాణం జరగకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా వర్షాకాలంలో నదిని దాటుకొని కొమరాడ మండల కేంద్రానికి వివిధ పనుల కోసం రావాలంటే అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయాలి.

నాలి గుంపస్వామి, పూజారిగూడ గ్రామం

వైసీపీ ప్రభుత్వం వచ్చాక సిమెంట్‌ బస్తా పని కూడా చేయలేదు

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లయినా వంతెన నిర్మాణం కోసం చిన్నపని కూడా చేపట్టలేదు. ఎమ్మెల్యేగా పుష్పశ్రీవాణి పదేళ్లుగా ఉన్నా పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే మాట తప్పారు. తొమ్మిది పంచాయతీల ప్రజలకు అవసరమైన వంతెన నిర్మాణం తక్షణమే పూర్తి చేస్తే గిరిజనులకు ఉపయోగకరంగా ఉంటుంది.

బిడ్డక తమ్మయ్య, అల్లువాడ గ్రామం

➡️