ఇజ్రాయిల్‌ ఆధీనంలోకి వెస్ట్‌బ్యాంక్‌, గాజా

Feb 24,2024 11:07 #Netanyahu

యుద్ధం అనంతర ప్రణాళిక పేరిటతో ప్రధాని నెతన్యాహూ వెల్లడి

జెరుసలేం : పాలస్తీనా పౌరులపై యుద్ధో న్మాదంతో ఊగిపోతున్న ఇజ్రాయిల్‌ మరోమారు తన అహంకారాన్ని చాటుకుంది. యుద్ధం అనంతర ప్రణాళిక పేరుతో ‘వెస్ట్‌బ్యాంక్‌, గాజా, జోర్డాన్‌ పశ్చిమ భాగం’ తమ ఆధీనంలోకి వస్తాయని ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి నెతన్యాహు శుక్రవారం ప్రకటించారు. హమాస్‌ సాయుధులను నిర్మూ లించే నెపంతో పాలస్తీనియన్‌ పౌరులపై ఇజ్రాయిల్‌ అమావనీయరీతిలో ఐదు నెలలుగా మారణకాండ సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ యుద్ధం ముగిస్తే.. పాలస్తీనా భూభాగంలో పాలనా పరిస్థితులకు సంబంధించి ఏం చేయాలనే దానిపై నెతన్యాహు ఈ ప్రణాళిక రూపొందించారు. వెస్ట్‌ బ్యాంక్‌, గాజాతో సహా జోర్డాన్‌ పశ్చిమభాగంలో భద్రతా నియంత్రణ మొత్తం ఇజ్రాయెల్‌ చేతిలో ఉంటుందని అందులో ప్రతిపాదించారు. దీనిని ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ కేబినెట్‌ ముందు ఆమోదానికి ఉంచారు. పాలస్తీనియన్లతో పరిష్కారం అనేది రెండు పక్షాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారానే సాధ్యపడుతుందని చెప్పుకొచ్చారు. గాజా-ఈజిప్టు సరిహద్దులోనూ ఇజ్రాయెల్‌ ఉనికి ఉంటుందని నెతన్యాహు ప్రతిపాదించారు. రఫా క్రాసింగ్‌తోపాటు స్థానికంగా స్మగ్లింగ్‌ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈజిప్టు, అమెరికాలకు సహకరిస్తామన్నారు. గాజాలో శాంతిభద్రతలను కాపాడుతూ హమాస్‌ పాలనను భర్తీ చేసేందుకు స్థానిక ప్రతినిధులతో కలిసి పనిచేస్తామని కూడా పేర్కొన్నారు. గాజా మానవసాయం కోసం పిలుపునిచ్చిన ఐరాస నేతత్వంలోని పాలస్తీనా శరణార్థి ఏజెన్సీని కూడా మూసివేయాలని ఆయన ప్రతిపాదించారు. దాని స్థానంలో ఇతర అంతర్జాతీయ సహాయ బందాలను కొనసాగించాలని పేర్కొన్నారు.

➡️