Israel : నెతన్యాహూకి వ్యతిరేకంగా లక్షలాది మంది ర్యాలీ

టెల్‌ అవీవ్‌ :   ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం లక్షలాది మంది భారీ యుద్ధ వ్యతిరేక ర్యాలీ చేపట్టారు. నెతన్యాహూకి వ్యతిరేకంగా ‘క్రైమ్‌ పోస్టర్‌’, ‘స్టాప్‌ ది వార్‌’ బ్యానర్లతో, నినాదాలతో నిరసనకారులు వీధుల్లోకి చేరారు. దేశంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

1,50,000 మందికి పైగా నిరసనకారులు ఈ ర్యాలీలో పాల్గొన్నట్లు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనను నిర్వహిస్తున్న హోఫ్షీ ఇజ్రాయిల్‌ పేర్కొంది.  హమాస్‌ స్వాధీనం చేసుకున్న వారి బంధువులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.  37,000 మందిని హత్య చేసిన గాజా యుద్ధాన్ని తక్షణమే ముగించాలని పిలుపునిచ్చారు.

తన మనవడి భవిష్యత్తు కోసం నిరసన తెలిపేందుకు వచ్చానని 66 ఏళ్ల షారు ఎరెల్‌ పేర్కొన్నారు. నెతన్యాహు ప్రభుత్వాన్ని అధికారం నుండి దింపకపోతే తమతో సహా తమ పిల్లలకు భవిష్యత్తు ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెతన్యాహు హయాంలో దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతుందని పేర్కొంటూ  టెల్‌ అవీవ్‌లోని డెమోక్రసీ స్క్వేర్‌లో రెడ్‌ పెయింట్‌ వేసి నిరసన తెలిపారు.

ఇజ్రాయెల్‌ చరిత్రలో నెతన్యాహు అత్యంత చెత్త ప్రధాని అని భద్రతా సంస్థ మాజీ చీఫ్  యువన్‌ డిస్కిన్‌ అన్నారు. ఇజ్రాయెల్‌లోని మితవాద పార్టీ సంకీర్ణం పట్ల ప్రజలు అసంతృప్తితో  ఉన్నారని ఈ నిరసన ద్వారా  స్పష్టమైన సందేశం పంపినట్లు భద్రతా మంత్రి ఇత్మార్‌ బెన్‌ గవిర్‌ సహా పలువురు నేతలు   పేర్కొన్నారు.

➡️