జూనియర్‌ డాక్టర్ల డిమాండ్ల పరిష్కారానికి బ్రిటన్‌ ప్రభుత్వం సుముఖత ?

లండన్‌ : అనూహ్యమైన రీతిలో ఆరు రోజుల పాటు సమ్మెను చేపట్టిన జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం సుముఖంగా వుందని ఎన్‌హెచ్‌ఎస్‌ నేత సూచనప్రాయంగా గురువారం తెలిపారు. సమ్మె నేపథ్యంలో పెరుగుతున్న ఒత్తిడే ఇందుకు ప్రధాన కారణంగా వుంది. మరోపక్క సమ్మెలో వున్న జూనియర్‌ డాక్టర్లకు సంఘీభావంగా ప్రజల నుండి మద్దతు పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్‌హెచ్‌ఎస్‌ ట్రస్ట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్‌హెచ్‌ఎస్‌ సమాఖ్య చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మాథ్యూ టేలర్‌ రేడియో 4తో మాట్లాడుతూ, వివాదాన్ని పరిష్కరించే దిశగా పురోగతి వుందనడానికి ప్రాతిపదిక వుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇదిలావుండగా, గంటకు 15 పౌండ్‌ స్టెర్లింగ్‌ల నుండి 21కి తక్షణమే పెంచాలని తాము కోరడం లేదని బిఎంఎ సహ అధ్యక్షుడు డాక్టర్‌ వివేక్‌ త్రివేది పదే పదే చెబుతూ వస్తున్నారు. 2008 స్థాయికి వేతనాలను పునరుద్ధరించాలని కోరామని, ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదని చెప్పారు. అయితే ప్రభుత్వం జాప్యందారీ ఎత్తుగడలు అనుసరిస్తే మరింత కఠినమైన కార్యాచరణ వుంటుందని ఆయన స్పష్టం చేశారు. సమ్మె ముగిసేలోగా ప్రభుత్వం చర్చలకు సిద్ధం కావాలన్నారు.

➡️