రఫా పట్టణంలోనే గాజా జనాభాలో సగానికి పైగా ప్రజలు : ఐరాస

Feb 6,2024 16:54 #Gaza, #israel hamas war

 జెనీవా :    గాజా మొత్తం జనాభా 2.3 మిలియన్లలో సగానికి పైగా ప్రజలు ఈజిప్ట్‌, పరిసర ప్రాంతాల సరిహద్దుల్లో ఉన్న రఫా నగరంలోనే తలదాచుకుంటున్నారని ఐరాస మంగళవారం తెలిపింది. ఇజ్రాయిల్‌ తరలింపు ఆదేశాలు గాజాస్ట్రిప్‌లోని మూడింట రెండు వంతుల భూభాగాన్ని లేదా 246 చదరపు కిలోమీటర్లు ఆక్రమించాయని.. దీంతో గాజా జనాభాలో సగానికి పైగా ప్రజలు రఫాలోనే కిక్కిరిసి ఉన్నారని    ఐరాసలోని మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం పేర్కొంది.

సుమారు నాలుగునెలల పాటు ఇజ్రాయిల్‌ చేపట్టిన అమానవీయ దాడుల్లో సుమారు 27,478 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.  గాజా నివాసితులలో నాలుగింట ఒకవంతు ప్రజలు ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు. జనాభాలో 85 శాతం మంది నిరాశ్రయులవగా, వేలాది మంది తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

సోమవారం సౌదీ అరేబియా పర్యటన చేపట్టిన  అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌.. కొద్ది సేపటికే సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఇజ్రాయిల్‌ దాడులు చేపట్టిన తర్వాత మధ్యప్రాచ్యంలో బ్లింకెన్‌ వరుసగా ఐదో పర్యటించడం గమనార్హం.

➡️