వాతావరణ లక్ష్యాల సాధనకు అణు ఇంధనమే మార్గం

– ప్రపంచ తొలి అణు ఇంధన సదస్సులో వక్తలు
బ్రస్సెల్స్‌ : శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను పెంపొందించడం, ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహాన్నిందించడం వంటి అంతర్జాతీయ సవాళ్ళను ఎదుర్కొనడంలో అణు ఇంధన పాత్ర ప్రముఖమైనదని వక్తలు పేర్కొన్నారు. కర్బన ఉద్ఘారాలు తగ్గించేందుకు నిర్దేశించుకున్న వాతావరణ లక్ష్యాలను సాధించడానికి అణు ఇంధనమే మార్గమని తెలిపారు. గురువారం ఇక్కడ ప్రారంభమైన ప్రపంచ తొలి అణు ఇంధన సదస్సులో 30కి పైగా దేశాల నుండి ప్రతినిధులు పాల్గన్నారు. వీరిలో ప్రభుత్వాధినేతలు, నాయకులు, సీనియర్‌ ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల నేతలు వున్నారు. కేవలం అణు ఇంధనంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ జరిగిన మొదటి అత్యున్నత స్థాయి సమావేశం ఇదే. అంతర్జాతీయ ఇంధన సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫాతిV్‌ా బైరోల్‌ మాట్లాడుతూ, అణు ఇంధనం పోషించే అద్వితీయమైన పాత్రను నొక్కి చెప్పారు. అణు విద్యుత్‌ మద్దతు లేకుండా వాతావరణ లక్ష్యాలను మనం సకాలంలో సాధించలేమని అన్నారు. ఐఎఇఎ డైరెక్టర్‌ జనరల్‌ రాఫెల్‌ గ్రాసి మాట్లాడుతూ, పరిశుద్ధమైన ఇంధనంలో నాలుగవ వంతును అణు ఇంధనం అందిస్తోందన్నారు. సురక్షితమైన, భద్రమైన, అణు వ్యాప్తి లేని రీతిలో అణు ఇంధనాన్ని ఉపయోగించేలా తమ సంస్థ సాయపడుతుందని చెప్పారు. అణు విద్యుత్‌ శాఖల నిర్వహణలో చైనా అంతర్జాతీయంగా మూడో స్థానంలో వుందన్నారు. ఇంకా కొత్త యూనిట్లు అనేకం ప్రస్తుతం నిర్మాణంలో వున్నాయని చైనా అణు ఇంధన సంస్థ తెలిపింది.

➡️