నైలునదిలో బోటు మునిగి 19మంది దినసరి కూలీలు మృతి

Feb 27,2024 08:44 #19, #boat, #daily, #died, #laborers, #river Nile

కైరో (ఈజిప్టు) : నైలు నదిలో ఫెర్రీ బోటు మునిగి 19మంది దినసరి కూలీలు మృతి చెందిన విషాద ఘటన ఈజిప్టు రాజధాని కైరో శివార్లలో గిజాలోని మోన్షాత్‌ ఎల్‌ కాంటేర్‌ పట్టణంలో జరిగింది. ఈ ఘోర దుర్ఘటనలో 19 మంది దినసరి కూలీలు చనిపోయినట్లు సమాచారం. కూలీలంతా ఓ నిర్మాణ సైట్‌లో పనికి వెళుతున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చనిపోయినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల ఈజిప్టియన్‌ పౌండ్లు, గాయపడ్డ ఐదుగురికి ఒక్కొక్కరికి 20 వేల పౌండ్ల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. అప్పర్‌ ఈజిప్ట్‌లోని నైలు నది డెల్టాలో ప్రజలు ఎక్కువగా తమ రోజువారి పనుల కోసం ఫెర్రీ బోట్లలోనే ప్రయాణిస్తుంటారు. నిర్వహణా లోపాల కారణంగా ఈజిప్టులో తరచూ రోడ్డు, రైలు, బోటు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన బోటు ప్రమాదాల్లోనూ నైలు నదిలో మునిగిపోయి చాలా మంది మరణించినట్లు గణాంకాల ద్వారా తెలుస్తుంది.

➡️