ట్రంప్‌పై పాక్షిక గ్యాగ్‌ ఆదేశాలు జారీ చేసిన న్యూయార్క్‌ జడ్జి

Mar 28,2024 07:59 #Donald Trump, #Trump

న్యూయార్క్‌ : మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అశ్లీల తారకు రహస్యంగా డబ్బు చెల్లింపులు జరిపిన కేసులో విచారణకు నాయకత్వం వహించిన న్యూయార్క్‌ న్యాయమూర్తి మంగళవారం ట్రంప్‌పై పాక్షికంగా గ్యాగ్‌ ఆదేశాలు జారీ చేశారు. సాక్షులపై, ప్రాసిక్యూటర్లపై, కోర్టు సిబ్బంది, వారి కుటుంబాలు లేదా కాబోయే న్యాయమూర్తులపై బహిరంగంగా దాడి చేయరాదని న్యాయమూర్తి జువాన్‌ మర్చన్‌ ఆదేశించారు. విచారణకు ముందుగా న్యాయమూర్తి, ఆయన కుమార్తెపై ట్రూత్‌సోషల్‌లో ట్రంప్‌ వరుస పోస్టులు పెట్టిన కొద్ది గంటల్లోనే ఈ ఆదేశాలు వెలువడ్డాయి. మర్చన్‌ ‘నిజమైన, సర్టిఫైడ్‌ ట్రంప్‌ విద్వేషి’ అని ట్రంప్‌ అభివర్ణించారు. మరో మాటల్లో చెప్పాలంటే ఆయన నన్ను ద్వేషిస్తున్నారని ట్రంప్‌ స్పష్టం చేశారు. న్యాయమూర్తి మర్చన్‌ ఈ విచారణ నుండి తనకు తాను దూరంగా వుండాలి, ఆయన పారదర్శకంగా విచారణ జరపలేరని వ్యాఖ్యానించారు. ట్రంప్‌పై కేసును విచారిస్తూ ఇలా పాక్షికంగా గ్యాగ్‌ ఆదేశాలను జారీ చేసిన మూడో న్యాయమూర్తి మర్చన్‌. న్యూయార్క్‌లో వ్యాపార అవినీతి కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆర్థర్‌ ఎగ్‌రాన్‌ కూడా గతంలో ఇలాగే పాక్షికంగా గ్యాగ్‌ ఆదేశాలు జారీ చేశారు.

➡️