Assange : ఆస్ట్రేలియా అభ్యర్థనను పరిశీలిస్తామన్న అమెరికా

వాషింగ్టన్‌ :   వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేపై ఆస్ట్రేలియా అభ్యర్థనను పరిశీలిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ బుధవారం ప్రకటించారు. అమెరికా దౌత్యపరమైన పత్రాలను ప్రచురించారన్న ఆరోపణలపై విచారణ కోసం బ్రిటన్‌ జైలులో అసాంజేను అప్పగించాలంటూ దశాబ్దకాలంగా అమెరికా ఒత్తిడి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. అధికారిక పర్యటన కోసం అమెరికా వచ్చిన జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదాకు బైడెన్‌ బుధవారం ఆతిథ్యం ఇస్తున్న సమయంలో ఆస్ట్రేలియా అభ్యర్థనపై బైడెన్‌ పైవిధంగా సమాధానమిచ్చారు.

బైడెన్‌ వ్యాఖ్యలపై వికీలీక్స్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ క్రిస్టిన్‌ స్పందించారు. జూలియన్‌పై వచ్చిన ఆరోపణలను బైడెన్‌ ఉపసంహరించుకోవడం ద్వారా  భావప్రకటన స్వేచ్ఛను, ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల, ప్రచురణ కర్తల హక్కులను పరిరక్షించినట్లవుతుందని అన్నారు.  ఈ చట్టపరమైన ప్రక్రియను ముగించాలని, జూలియన్‌ను విడిపించాలని, జర్నలిజం నేరం కాదని గుర్తించాలని తాము కోరుతున్నామని అన్నారు.

గూఢచర్యం ఆరోపణలపై అసాంజేకు మరణ శిక్ష విధించమని అమెరికా అధికారులు హామీ ఇస్తే తప్ప ఆయనను అమెరికాకు అప్పగించలేమని బ్రిటీష్‌ కోర్టు గత నెలలో తీర్పునిచ్చింది.

➡️