ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో సిసికే పట్టం 

Presidential Elections

89.6 శాతం ఓట్లతో గెలుపు

కైరో : ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షులు అబ్దెల్‌-ఫత్తా అల్‌-సిసి ఘన విజయం సాధించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్లలో సిసి సుమారు నాలుగు కోట్ల ఓట్లు లేదా 89.6 శాతం ఓట్లతో ఆయన విజయం సాధించినట్లు ఈజిప్ట్‌ నేషనల్‌ ఎలక్షన్‌ అథారిటీ (ఎన్‌ఇఎ) ప్రకటించింది. కైరోలో విలేకరుల సమావేశంలో ఎన్‌ఇఎ ఛైర్మన్‌ హజెమ్‌ బదావీ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో స్వదేశంలో, విదేశాలలో దాదాపు 4.48 కోట్ల మంది ఓటు వేశారని, మొత్తం 6.7 కోట్ల మంది అర్హులైన ఓటర్లలో 66.8 శాతం పోలింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. ఇది ఈజిప్ట్‌ చరిత్రలోనే అత్యధిక పోలింగ్‌ శాతమన్నారు. రిపబ్లికన్‌ పీపుల్స్‌ పార్టీకి నాయకత్వం వహిస్తున్న హజెమ్‌ ఒమర్‌ 4.5 శాతం ఓట్లు సాధించగా, ఈజిప్షియన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఫరీద్‌ జహ్రాన్‌, ఈజిప్షియన్‌ వాఫ్ద్‌ పార్టీకి చెందిన అబ్దెల్‌-సనాద్‌ యమామా తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత జాతిని ఉద్దేశించి సిసి ప్రసంగించారు. ‘దేశానికి నాయకత్వం వహించే లక్ష్యం కోసం నన్ను ఎన్నుకున్నారు’ అని తెలిపారు. ప్రస్తుతం ఈజిప్టు అనేక సవాళ్లతో పోరాడుతోందని అన్నారు. గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు ‘ఈజిప్ట్‌ యొక్క జాతీయ భద్రతకు’ ముప్పుగా మారాయని అన్నారు. అయితే జాతీయ భద్రత, ప్రజల ప్రయోజనాలను రక్షించే, ఆర్థిక సామర్థ్యాలను ఈజిప్టు కలిగిఉందని కూడా తెలిపారు. ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల ఓటింగ్‌ స్వదేశంలో ఈ నెల 10, 12 తేదీల్లో జరగా, విదేశాల్లో ఉన్న ఈజిప్షియన్లు ఈనెల 1-3 తేదీల్లో ఓట్లు వేశారు. 121 దేశాల్లో పోలింగ్‌ జరిగింది.

➡️