మహా ఘటబంధన్‌ పాలనలోని రూ. 826 కోట్ల ఒప్పందాలు రద్దు

పాట్నా : బీహార్‌లోని బిజెపి, జెడి(యు)లతో కూడిన ఎన్‌డిఎ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గత ప్రభుత్వం మహా ఘటబంధన్‌ పాలనలో కుదుర్చుకున్న రూ.826 కోట్ల విలువైన 350 ఒప్పందాలను రద్దు చేసింది. పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ (పిహెచ్‌ఇడి)లో కుదిర్చిన ఈ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వీటిని రద్దు చేసింది. శాఖా పరమైన విచారణకు ఆదేశించింది. ఈ వివరాలను పిహెచ్‌ఇడి మంత్రి నీరజ్‌కుమార్‌ సింగ్‌ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. మహా ఘటబంధన్‌ ప్రభుత్వంలో జెడి(యు) భాగస్వామ్య పార్టీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్‌కుమార్‌ బిజెపితో జత కట్టి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఒప్పందాలను రద్దు చేయడంపై ఆర్‌జెడి తీవ్రంగా స్పందించింది. తమ పార్టీ నాయకులు తేజస్వీ యాదవ్‌కు ఉన్న ప్రజాదరణ చూసి ఎన్‌డిఎ ప్రభుత్వం భయపడుతోందని ఆర్‌జెడి నాయకులు మృత్యుంజయ తివారీ అన్నారు. ఎలాంటి విచారణకైనా తమ పార్టీ సిద్ధమని, ఇటువంటి రాజకీయాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

➡️