జర్మనీలో ఆరోగ్య సంస్కరణలపై అలజడి

May 19,2024 08:39 #Any health, #jarmany
  •  ఆసుపత్రులు పెద్దయెత్తున మూతపడతాయన్న హక్కుల కార్యకర్తలు, వైద్యులు

బెర్లిన్‌: జర్మనీలోని సోషల్‌ డెమొక్రాట్‌ -గ్రీన్‌ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి ఆరోగ్యరంగాన్ని విప్లవీకరిస్తాయని ఆరోగ్య శాఖ మంత్రి కార్ల్‌ లాతర్‌బాచ్‌ అభివర్ణించగా, పెద్దయెత్తున ఆసుపత్రులు మూసివేయడమే ఈ సంస్కరణల లక్ష్యమని హక్కుల కార్యకర్తలు, వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ద్రవ్యోల్బణం, ఇంధన ధరలకు అనుగుణంగా ఆరోగ్య రంగానికి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు పెంచాల్సింది పోయి కోత పెట్టింది. దీంతో చాలా ప్రభుత్వ ఆసుపత్రులు నిధుల కొరతతో దీనావస్థకు చేరాయి. ఇప్పుడీ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి కానీ, వాటికి ఆర్థిక తోడ్పాటు నందించడం గురించి కానీ ఒక్క ముక్క కూడా మాట్లాడడం లేదు. ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమెలా అన్న దాని గురించి కాకుండా అనవసర చికిత్సలను నిరుత్సాహపరిచేందుకు ఆసుపత్రుల సామర్థ్యం మదింపు జాబితా నుంచి కొన్ని ట్రీట్‌మెంట్లను తొలగించారు.
ఆరోగ్య సేవలను కుదించేందుకే ఆసుపత్రుల పెర్ఫార్మెన్స్‌ మదింపు బృందాలను కొత్తగా తెరపైకి తీసుకొచ్చారని అలయెన్స్‌ క్లినిక్‌ రెస్క్యూ ప్రతినిధి లారా వలెంతుకెవిసియుట్‌ సోషలిస్టు వార్తా పత్రిక జంగ్‌ వెల్త్‌ తో మాట్లాడుతూ చెప్పారు. మార్బర్గర్‌ బండ్‌ డాక్టర్స్‌ యూనియన్‌ చైర్‌ ఉమెన్‌ సుసానె జానె మాట్లాడుతూ, ఆసుపత్రులకు ఆర్థిక సాయం అనవసరమని సంస్కరణలు చెబుతున్నాయని అన్నారు. గతేడాది యాభై దాకా ఆసుపత్రులు దివాలా తీశాయని, ఇప్పుడీ సంస్కరణలతో మరిన్ని ఆసుపత్రులు మూతపడే ప్రమాదముందని ఆమె అన్నారు.

➡️